కాశ్మీర్‌కు సంబంధించి అమలులో ఉన్న ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేసే నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని, దీనివల్ల కాశ్మీర్ పౌరుల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు, హక్కులకు భంగం కలుగుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు యావత్ దేశమే కాదు.. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తోంది.. ఇప్పటికే జమ్మూ, కాశ్మీర్‌లలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను, పర్యాటకులను, అక్కడ చదువుకుంటున్న ఇతర రాష్ట్రాలను ఖాళీ చేయించి.. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ క్రమంలో తెరపైకి అనేక వాదనలు వస్తున్నాయి. కొందరు పీవోకేపై భారత్ అటాక్ చేసి దాన్ని ఆక్రమించుకుంటుందని అంటుంటే.. మరికొందరు ఆర్టికల్ 370, 35ఎ లను మోదీ ప్రభుత్వం రద్దు చేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంత సేపటి క్రితమే ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ కూడా జరుగుతుంది. అయితే కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనూహ్య ప్రకటన చేస్తుందోనని ఇప్పుడందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అయితే కాశ్మీర్‌కు సంబంధించి అమలులో ఉన్న ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేసే నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని, దీనివల్ల కాశ్మీర్ పౌరుల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు, హక్కులకు భంగం కలుగుతుందని మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మాజీ సీఎంలు, ప్రతిపక్ష నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ఇక అటు లోక్‌సభలో కాశ్మీర్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అయితే అసలింతకీ ఆర్టికల్ 370, 35ఎ అంటే ఏమిటంటే.. ఆర్టికల్ 370 వల్ల జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఉన్న రాష్ట్రంగా పరిగణింపబడుతుంది. అంటే దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు లేని ప్రత్యేక అధికారాలు జమ్మూ కాశ్మీర్‌కు ఉంటాయి. ఈ క్రమంలో వారు మన దేశ పార్లమెంట్‌తో సంబంధం లేకుండా అక్కడ అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చు. ఇక ఆర్టికల్ 35ఎ ద్వారా జమ్మూ కాశ్మీర్ శాశ్వత నివాసి ఎవరు.. అన్నది నిర్దారిస్తారు. అంటే.. అక్కడ 10 ఏళ్లుగా స్థిరంగా నివాసం ఉన్నవారు లేదా.. 1954 మే 14వ తేదీ ముందు నుంచి ఉన్నవారిని కాశ్మీర్ శాశ్వత పౌరులుగా నిర్ణయిస్తారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు స్థిర నివాసి అన్న ముద్ర పడ్డ కాశ్మీర్ పౌరులకే వర్తిస్తాయి. ఇక దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాశ్మీర్‌లో భూములను కొనుగోలు చేయలేరు. ఇలా ఆర్టికల్ 35ఎ ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి.
కాగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ లను రద్దు చేస్తే గనక ఇకపై జమ్మూ కాశ్మీర్ కూడా మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఒకటిగానే సాధారణ రాష్ట్రంగానే ఉంటుంది. దానికి ఎలాంటి స్వయం ప్రతిపత్తి ఉండదు. ఇక అక్కడి పౌరులకు ఎలాంటి ప్రత్యేక హక్కులూ ఉండవు. అన్ని రాష్ట్రాల్లానే సాధారణ రాష్ట్రంగానే జమ్మూ కాశ్మీర్‌ను పరిగణిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఆర్టికల్స్‌ను రద్దు చేసే నిర్ణయం తీసుకుంటుందా.. లేక పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తుందా.. అన్నది ఉత్కంఠగా మారింది.
అయితే ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేస్తే కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగే అవకాశం ఉంటుంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఇక పీవోకేను స్వాధీనం చేసుకోవాలని చూస్తే భారత్, పాక్‌ల మధ్య కచ్చితంగా యుద్ధం వస్తుంది. అందుకు కూడా పెద్ద ఎత్తున సైన్యం కావాలి. కనుకనే ముందు జాగ్రత్తగా జమ్మూ కాశ్మీర్‌లో బలగాలను మోహరించారు. అయితే ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో కాశ్మీర్‌పై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే ఆ ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు..!