ఆత్మీయ సమ్మేళనంతో తెలంగాణలో షర్మిల అలజడి రేపారు. ఇంకా పార్టీ కూడా పెట్టకముందే అన్ని పార్టీల నేతలు స్పందించేలా చేశారు. అటు ఏపీలో కూడా షర్మిల తెలంగాణలో ఎంతవరకు విజయవంతమౌతారనే చర్చ జోరుగానే జరుగుతోంది. షర్మిల పాదయాత్ర చేసిన అప్పటి ప్రజా స్పందన ఇప్పుడు కూడా వస్తుందా…వరుస భేటీలతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న షర్మిల ప్యూహం పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలకు తాను ఎలా ప్రత్యామ్నాయం అవుతాననేది షర్మిల ప్రజలకు స్పష్టంగా చెప్పగలగాలి. తాను తెస్తానంటున్న రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో.. అది ఇప్పుడు ఎందుకు రాదో కూడా కన్విన్స్ చేయగలగాలి. ఇవన్నీ జరిగినప్పుడే షర్మిల పార్టీ తెలంగాణలో బలపడే అవకాశం ఉంటుంది. గత అనుభవాల్ని బట్టి చూస్తే.. షర్మిలకు ప్రజలతో కమ్యూనికేట్ చేసే నైపుణ్యం విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. అయితే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రజల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయనే అంశమే.. షర్మిల రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
రాబోయే కొన్ని నెలల్లో తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎప్పుడూ సెంటిమెంట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని పట్టుకోవడంలో కేసీఆర్ ఇప్పటికే తలపండి పోయారు. కాంగ్రెస్ ఆ విషయంలో విఫలమయ్యే రెండుసార్లు అధికారానికి దూరమైంది. మరి తెలంగాణ సెంటిమెంట్ ను తట్టుకుని షర్మిల ఎలా రాజకీయం చేస్తారనే విషయం.. ఆమె పార్టీ భవిష్యత్తును తేల్చనుంది.
తెలంగాణ రెడ్డి సామాజికవర్గంపై షర్మిల చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. షర్మిల ఆశించిన స్థాయిలో రెడ్లు ఆమె వైపు మొగ్గుచూపుతారా అనేది కూడా చెప్పడం కష్టమే. షర్మిలను తెలంగాణ రెడ్లు ఎలా చూస్తున్నారనేది కూడా ఇక్కడ కీలకమే. షర్మిలను కేవలం ఓట్లు చీల్చే నేతగా చూస్తారా… లేకపోతే రాజన్న రాజ్యం తేగలిగే సత్తా ఉన్న నేతగా పరిగణిస్తారా అనే అంశమే.. రెడ్ల మద్దతు ఏ స్థాయిలో ఉంటుందనే విషయం చెప్పనుంది. వైఎస్ వారసత్వం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి షర్మిలకు గట్టిపోటీ ఎదురవ్వడం ఖాయం.
రాజకీయ పార్టీ పెట్టడం కేసీఆర్ చెప్పినట్టుగా ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుత రాజకీయాల్లో పార్టీని నడపాలంటే నేతలు, క్యాడర్ తో పాటు నిధులు కూడా చాలా అవసరం. షర్మిల వైపు ఎంత మంది నేతలొస్తారు.. క్యాడర్ ఏ స్థాయిలో ఉంటుందనే విషయం పక్కనపెడితే.. నిధులు ఎక్కడ్నుంచి వస్తాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీని నడిపే స్థాయిలో షర్మిల దగ్గర నిధులున్నాయా.. లేకపోతే నిధుల సమీకరణ ఎలా చేస్తారు.. ఎక్కడ్నుంచి నిధులు తీసుకొస్తారనేది కీలకంగా మారింది.
సమైక్యవాది కుటుంబానికి చెందిన షర్మిల.. తెలంగాణ సెంటిమెంట్ ను ఎలా ఎదుర్కుంటారనేది కీలకమైన ప్రశ్న. అసలు తెలంగాణతో నీకేంటి సంబంధం అని అడిగితే షర్మిల ఏం చెబుతారనేది కూడా ప్రస్తుతానికి సమాధానం లేని సవాలే. షర్మిలను తెలంగాణ కోడలిగా ప్రచారం చేయాలని ఆమె సన్నిహితులు భావిస్తున్నా.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.