ప్రస్తుతం చాలా వరకు దేశాలు సంప్రదాయ టెస్ట్ మ్యాచ్‌లకు బదులుగా డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతున్న విషయం విదితమే. టీ20లు వచ్చాక టెస్టులకు ఆదరణ తగ్గుతుందని భావించిన నిపుణులు డే నైట్ టెస్టుల ద్వారా ప్రేక్షకులకు టెస్టు మ్యాచ్‌లను దగ్గర చేసేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగానే డే నైట్ టెస్ట్‌లను ఆడుతున్నారు.
అయితే సాధారణంగా టెస్టులను పగటిపూటే నిర్వహిస్తారు. వెలుతురు లేకపోతే మ్యాచ్‌ను ఆపేస్తారు. మరలాంటప్పుడు డే నైట్ టెస్టులు ఎలా పెడతారు ? అని కొందరికి సందేహం కలగవచ్చు. అందుకనే డే నైట్ టెస్టుల్లో పింక్ కలర్ బంతులను వాడడం మొదలు పెట్టారు. అయితే సాధారణ ఎరుపు బంతులకు, పింక్ కలర్ బంతులకు తేడాలేమిటి ? పింక్ కలర్ బంతుల వల్ల బౌలర్లకు గానీ, బ్యాట్స్‌మెన్‌కు గానీ ఏమైనా లాభాలు ఉంటాయా ? అంటే.. అవును.. ఉంటాయి. కానీ బ్యాట్స్ మెన్ కు కాదు, బౌలర్లకు. పింక్ కలర్ బంతుల వల్ల బౌలర్లకు లాభాలు ఉంటాయి. కానీ బ్యాట్స్ మెన్లు పింక్ కలర్ బంతులను ఆడాలంటే కష్టపడాలి.
సాధారణ ఎరుపు బంతులకు వ్యాక్స్‌ను వాడుతుంటారు. దాని వల్ల బంతి కొన్ని ఓవర్లు అయ్యాక ఒక వైపు మెరుపుదనం పోయి రఫ్‌గా మారుతుంది. దీంతో బౌలర్లకు స్వింగ్ లభిస్తుంది. అలాగే స్పిన్నర్లు బంతిని టర్న్ చేయగలుగుతారు. అయితే పింక్ బంతులకు వ్యాక్స్ ను వాడితే బంతి నల్లగా మారుతుంది. కనుక దానికి వ్యాక్స్‌కు బదులుగా పాలిష్ లేదా లాకర్‌ను వాడుతారు. దీంతో బంతి 40 ఓవర్లు అయ్యే వరకు కొత్తగానే ఉంటుంది. దీని వల్ల బౌలర్లకు వేగంగా బంతులను వేస్తూ స్వింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఎరుపు రంగు బంతుల కన్నా పింక్ బంతులే ఎక్కువగా టర్న్ అవుతాయని నిర్దారించారు. అందువల్ల ఎటు చూసినా ఎరుపు కన్నా పింక్ కలర్ బంతుల వల్లే బౌలర్లకు 10 నుంచి 15 శాతం అదనపు ప్రయోజనం కలుగుతుంది. అదే బ్యాట్స్‌మెన్ అయితే పింక్ కలర్ బంతులను ఆడేందుకు శ్రమించాల్సి ఉంటుంది.
ఇక ఎరుపు, పింక్ కలర్ బంతులకు స్వల్ప తేడాలు ఉంటాయి. ఎరుపు రంగు బంతులను తెల్లని దారంతో కుడతారు. అదే పింక్ కలర్ అయితే నలుపు దారం ఉపయోగిస్తారు. ఎరుపు రంగు బంతులకు లెదర్ ఒక్కటే ఉంటుంది. పింక్ కలర్ బంతులకు లినెన్ కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల రాత్రి పూట కురిసే మంచును ఆ లినెన్ పీల్చుకుంటుంది. దీంతో బౌలర్లకు బంతిపై చక్కని గ్రిప్ లభిస్తుంది. ఇలా ఎరుపు రంగు కన్నా పింక్ కలర్ బంతుల వల్లే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భారత్ ఈ నెల 17 నుంచి ఆసీస్‌తో పింక్ కలర్ బంతితో డే నైట్ టెస్టు ఆడనుంది. మరి అందులో భారత బౌలర్లు ఎలాంటి ప్రదర్శనను ఇస్తారో చూడాలి.