పాత కేసులు తవ్వితీయడంతో ఆ నేత దూకుడుకు బ్రేక్‌లు పడ్డాయి. ఇప్పుడు మాట్లాడటమే కాదు.. కనపించడమే మానేశారు. ఆయనే చింతమనేని ప్రభాకర్ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దూకుడుగా వెళ్లిన ప్రభాకర్ వైఖరిలో వైసీపీ గెలిచాక చాలామార్పు వచ్చిందట. నోటికి తాళం వేసుకున్నారు. తననూ తన పార్టీని ఎవరైనా ఏదైనా అంటే చాలు తాచుపాములా సర్రున లేచే చింతమనేని మనకెందుకులే అని మౌనంగా ఉంటున్నారు. దీంతో చింతమనేనికి ఏమైంది అని అటు టీడీపీలోనూ ఇటు దెందులూరు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.
తొలిసారి ఎంపీటీసీగా గెలిచినప్పటి నుంచీ ఇసుకను చింతమనేని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్నారని కథలు కథలుగా చెప్పుకొంటారు. అప్పటి ఎమ్మార్వో వనజాక్షిపై దాడితో ఇది మరింత రచ్చ అయింది. ఇసుక వ్యాపారంలో ప్రత్యేకంగా ఓ సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2017లో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో సొంతంగా పార్టీపెట్టి చంద్రబాబుపైనే పోటీ చేస్తానని ప్రకటించి టీడీపీలో సంచలనం రేపారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి చేసినా.. దళితులకు పదవులెందుకు అని దూషించినా ఆయనకే చెల్లింది.
2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని.. 2019 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడదామని చూశారు. కానీ వైసీపీ దెబ్బకు ఆయనకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఆ ఓటమి నుంచి తేరుకునే లోపుగానే అధికార పార్టీ చింతమనేని ముందరి కాళ్లకు బంధమేసింది. మాజీ ఎమ్మెల్యే మాట్లాడినా.. ఇంటి నుంచి కాలుతీసి బయటపెట్టినా కేసు పెట్టే పరిస్థితి ఎదురైంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న చింతమనేని మీద అప్పట్లో చాలా కేసులు నమోదయ్యాయి. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఒక్క కేసులో కూడా అరెస్ట్ లేదు… డిమాండ్ లేదు… జైలు లేదు. కానీ.. వైసీపీ ఊరుకోదు కదా.. పాత కేసులు అన్నీ తిరగదోడింది. అరెస్ట్ చేసింది. ఒక కేసులో బెయిల్ వస్తుందనగానే ఇంకో కేసు పెట్టారు.
జైలు జీవితం ఎఫెక్టో ఏమో కానీ.. చింతమనేని తీరులో పూర్తిగా మార్పు వచ్చేసిందట. గతంలోలా దూకుడు ప్రదర్శించడం లేదు. ఒకప్పుడు టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రంలో ముందువరసలో ఉండే ఆయన ఇప్పుడు పార్టీకి, మీడియాకు దూరంగా ఉంటున్నారు. పైగా ఇటీవల ప్రకటించిన టీడీపీ జాతీయ కమిటీలో చోటు దక్కలేదు. పైగా 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చింతమనేనిని టీడీపీ పట్టించుకోవడం లేదన్న టాక్ ఉంది. మరి ఈ మాజీ ఎమ్మెల్యే ఎన్నాళ్లు బుద్ధిగా మౌనంగా ఉంటారో చూడాలి.