బాలీవుడ్ వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్.. ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు.. అలా చేసుకునేలా బాలీవుడ్‌లోని ఓ సమాజమే అతన్ని పురికొల్పింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. బాలీవుడ్‌లో ఓ ప్రముఖ ప్రొడ్యూసర్.. ఆ ప్రొడ్యూసర్ చుట్టూ ఉండే చెంచాగిరీ చేసే బడా నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం.. సుశాంత్‌ను దూరం పెట్టడం వల్లే.. డిప్రెషన్‌కు లోనై అతను ఆత్మహత్య చేసుకున్నాడని లోకం కోడై కూస్తోంది. అయితే ఈ పోకడ నిజానికి కేవలం బాలీవుడ్‌కే పరిమితమా ? సినీ రంగంలోనే ఇలా ఉందా ? అంటే.. కాదు.. దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఈ తరహా వైఖరి మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
కేవలం సినిమాలే కాదు.. రాజకీయాలు, పలు ఇతర రంగాల్లోనూ ప్రముఖులు తమ కొడుకులు, కూతుళ్లు, ఇతర బంధువులు, వారి పిల్లలు, మనవలు.. ఇలా వారసత్వంగా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఇది మన దేశంలో ఏ ఒక్క రంగానికీ పరిమితం కాదు. దీంతో కొత్త వారు తాము ఎంచుకునే రంగంలో అడుగు పెట్టి సక్సెస్ అయితే.. సదరు సో కాల్డ్ ప్రముఖులు తట్టుకోలేరు. వారిని అణచివేసేందుకే చూస్తారు. ఇది కేవలం సినిమా రంగంలోనే కాదు.. దాదాపుగా అంతటా ఉంది.. కానీ సుశాంత్ ఆత్మహత్య ఇలాంటి పైత్యపు ఆధిపత్య ధోరణిని ప్రపంచానికి మరోమారు ఎత్తి చూపింది. అయితే…
ఇప్పుడు కేవలం ఒక్క సుశాంత్ సింగ్‌కే ఇలా జరగలేదు. గతంలో ఎంతో మంది ఇలాంటి ఆధిపత్య, అణచివేత ధోరణికి, ఆ సమాజానికి చెందిన వారు పెట్టే ఇబ్బందులకు బలయ్యారు. బలవుతున్నారు.. ఇకపై కూడా కొనసాగుతాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి ? అంటే.. ప్రజలే.. అవును.. అలాంటి వారికి మనం అనవసరంగా ప్రాధాన్యతను కల్పించకూడదు. కేవలం వారసత్వం, ధన బలం, మదం చూసుకుని రెచ్చిపోయే వారిని ప్రజలు ఆదరించాల్సిన పనిలేదు. వారిని పట్టించుకోనవసరం లేదు. కష్టపడి పనిచేస్తూ.. తమ సొంత తెలివితేటలు.. నైపుణ్యాలు, ప్రతిభతో పైకి వచ్చే.. ఏ రంగానికి చెందిన వారినైనా సరే.. ప్రజలు నెత్తిన పెట్టుకోవాలి. కేవలం తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని, ఎలాంటి నైపుణ్యాలు లేకుండా, ధన బలం, పేరుతో పెత్తనం చేయాలనుకునే వారికి ప్రజలు చెంప పెట్టులా సమాధానం చెప్పాలి. వారిని జాకీలు పెట్టి మనం పైకి లేపాల్సిన పనిలేదు. ఆ పని చేసేందుకు వారి అనుయాయులు, సో కాల్డ్ మీడియా సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కనుక వారికి మన సపోర్టు కించిత్ కూడా అవసరం లేదు. కష్టపడి పనిచేసే వారినే మనం సమర్థించాలి. వారికే మనం అండగా నిలవాలి. అది ఏ రంగంలోని వారికైనా సరే.. అలాంటి వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. రేప్పొద్దున వారి చూసి ఇంకొందరు ప్రేరణ పొందుతారు. అదీ.. మనం చేయాల్సింది.. అలా చేస్తే.. సుశాంత్ సింగ్ లాంటి వారు చనిపోకుండా ఉంటారు. లేదంటే అలాంటి ఎంతో మంది ఆత్మహత్యలను మనం భవిష్యత్తులో మళ్లీ చూడక తప్పదు.