ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ దుండగులు ఏదో ఒక రూపంలో వారి సొమ్మును కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య మరీ ఎక్కువైంది. జనాలు మోసగాళ్లు పన్నే వలలో పడి రూ.వేలు, లక్షల్లో నష్టపోతున్నారు. ఇక తాజాగా వాట్సాప్ ఓటీపీ పేరిట మరొక కొత్త స్కాం వెలుగు చూసింది. అనేక మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఈ క్రమంలో ఈ స్కాం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం వాట్సాప్‌ను డివైస్ లో కొత్తగా ఇన్‌స్టాల్ చేయగానే.. మనం మన ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే అది ఓటీపీ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకుంటుందనే విషయం తెలిసిందే. అయితే దుండగులు ఏం చేస్తారంటే.. తమ వాట్సాప్ యాప్ పనిచేయడం లేదని లేదా యాప్ ఆటోమేటిగ్గా లాగవుట్ అయిందని, కనుక మీ మొబైల్ నంబర్‌కు తమ అకౌంట్ ఓటీపీ వస్తుందని నమ్మబలుకుతారు. వారు మీకు తెలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులమని నమ్మిస్తూ అలా మోసం చేస్తారు. ఆ సందర్భంలో ఆ విషయం నిజమే అని నమ్మి మీకు వచ్చిన వాట్సాప్ ఓటీపీ చెప్పారా.. అంతే సంగతులు, మీ వాట్సాప్ ఖాతా వారి చేతుల్లోకి వెళ్తుంది. తరువాత మీ సమాచారంతో మీలా నటిస్తూ మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల దగ్గర హ్యాకర్లు డబ్బులు తీసుకోవచ్చు. ఇలా వారు మోసం చేస్తారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయి.
అందువల్ల ఎవరైనా సరే.. బ్యాంకింగ్ వివరాలతోపాటు వాట్సాప్ ఓటీపీ వివరాలను కూడా చెప్పకూడదు. అవతలి వారు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు అవునా, కాదా ముందుగా నిర్దారించుకోవాలి. ఒకవేళ పొరపాటు చేసినా వెంటనే వాట్సాప్‌లో లాగవుట్ అయ్యి, మళ్లీ లాగిన్ అవ్వాలి. దీంతో మోసాలు జరగకుండా చూసుకోవచ్చు.