ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2020 ఫిబ్రవరి నెల నుంచి పలు ఫోన్లకు తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ జాబితాలో పలు ఆండ్రాయిడ్, ఐఫోన్లతోపాటు విండోస్ ఫోన్లు కూడా ఉన్నాయి. 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆండ్రాయిడ్ 2.3.7 ఓఎస్ ఉన్న ఫోన్లతోపాటు ఐఓఎస్ 7 ఉన్న ఐఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.
కాగా డిసెంబర్ 31, 2019 వరకు మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నందున అదే తేదీ నుంచి విండోస్ ఫోన్లకు కూడా వాట్సాప్ సేవలను నిలిపివేస్తామని వాట్సాప్ తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా ఫోన్లను వాడే వినియోగదారులు తమ ఫోన్లను కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.
అయితే విండోస్ ఫోన్లలో వాట్సాప్‌ను వాడుతున్నవారు తమ డేటాను బ్యాకప్ తీసుకునేందుకు వాట్సాప్ అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆ యూజర్లు తమ వాట్సాప్ డేటాను డిసెంబర్ 31వ తేదీ లోపు బ్యాకప్ తీసుకోవచ్చు. ఇక కై ఓఎస్ ఆధారిత జియో ఫోన్, జియో ఫోన్ 2లలో మాత్రం వాట్సాప్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని వాట్సాప్ తెలిపింది.