టీఆర్ఎస్‌లో ఆ కీల‌క నేత‌లెక్క‌డ‌…!

-

ఒక‌ప్పుడు టీఆర్ ఎస్ పార్టీలో హేమాహేమీలుగా చెలామ‌ణి అయిన కీల‌క నేత‌లు ప‌లువురు ఇటీవ‌ల క‌నిపించ‌కుండా పోయారు.  రాజ్య‌స‌భ స‌భ్యుడు కేశ‌వ‌రావు, మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,  హరీశ్రావు, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, స్వామిగౌడ్ ఇలా చాలా మంది టీఆర్ఎస్ హేమాహేమీలు ఇప్పుడు ఇటు పార్టీ కార్యక్రమాల్లో గానీ..  అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు. వీరిలో కొందరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా.. మరి కొందరు రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచినవాళ్లూ ఉన్నారు. ఫస్ట్ టర్మ్ పాలనలో కీలకంగా వ్యవహరించిన ఈ నేతలంతా సెకండ్ టర్మ్ పాలనలో గప్చుప్ కావడంపై టీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

నర్సన్న, కేకే జాడేది..?
ఉద్యమ కాలం నుంచి కేసీఆర్కు వెన్నంటి ఉన్న నాయ‌కుడు  నాయిని నర్సింహారెడ్డి. టీఆర్ ఎస్ తొలి ప్రభుత్వంలో హోం మంత్రిగా ప‌నిచేసిన నాయిని ప్ర‌స్తుతం ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. టీఆర్ఎస్ తొలి సర్కార్లో ఎప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన ఉండే రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు జాడ ఇప్పుడు ఎక్కడా లేదు. అప్పట్లో ఏదైనా జాతీయస్థాయి అంశాలు వచ్చినప్పుడు ఆయన పార్టీ తరఫున మీడియా ముందుకు వ‌చ్చి గట్టిగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయ‌న గొంతు ఎక్క‌డా వినిపించ‌డంలేదు.

ట్ర‌బుల్ షూట‌ర్ ఎక్క‌డ‌..!
టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్రావు గ‌త ప్ర‌భుత్వంలో భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. కాళేశ్వ‌రంలాంటి భారీ జాతీయ‌స్థాయి ప్రాజెక్ట్‌ను ప‌రుగులు పెట్టించిన ఆయ‌న , ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో లేకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయ్యారు.

అంతేగాక కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులు గా పేరొందిన శాస‌న‌స‌భ మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి,  కౌన్సిల్ తొలి చైర్మన్ గా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టిన స్వామిగౌడ్ ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. హైదరాబాద్లోనే  నివాసం ఉంటున్న స్వామిగౌడ్ కు స్థానికంగా జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడంలేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

నాటి  డిప్యూటీల జాడేది..
టీఆర్ఎస్ తొలి సర్కారులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తాటికొండ రాజ‌య్య డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వీరిద్దరూ ప్ర‌స్తుత కేసీఆర్ సర్కార్లో, పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కడియం తన జిల్లా వరంగల్ కే పరిమితమయ్యారు. అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు.

తుమ్మ‌ల ఏమ‌య్యారు…
సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు స్థానం నుంచి ఓడిపోయినప్పటి నుంచి ఖమ్మం జిల్లాకే పరిమితమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటున్నట్లు స్థానిక నేతలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version