మనం ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడుతుంటే.. పక్కన పెద్దోళ్లు అరే అలా అనుకురా.. పైన తథాస్తు దేవతలు ఉంటారు అంటారు. తథాస్తు దేవతలు తథాస్తు అంటే అది జరిగిపోతుందని మన నమ్మకం.. అసలు వీళ్లు నిజంగానే ఉన్నారా..? ఉంటే ఏం టైంలో పైన తిరుగుతారు..?
మన పురాణాల ప్రకారం.. తథాస్తు దేవతలు ఉంటారు. తథ అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు. ఇలా తథాస్తు అనే వారినే తథాస్తు దేవతలు అని అంటారు. సూర్యుని భార్య అయిన సంధ్యా దేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురు దేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యా దేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యా దేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్వినీ కుమారులు. వీరినే తథాస్తు దేవతలని, దేవతా వైద్యులని అంటారు.
వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారట.. వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ, వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తథాస్తు అంటే అది కచ్చితంగా జరుగుతుందట.
అశ్వినీ కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతారు.. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారని.. వారు ఎక్కువగా సంధ్యా సమయంలో.. అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు. అందుకే మన పెద్దోళ్లు సాయంత్రం పూట ఏం మాటలు అవి అంటారు.. ఏదైనా మనం చెడుగా, వింతగా మాట్లాడితే..!
అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందట. మన గురించి, ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తథాస్తు అంటారట. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తథాస్తు దేవతలు ఈ మాటలను విని తథాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాల్లో చెబుతున్నాయి.