తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సమయంలో ఉంది. అంటే ఎన్టీఆర్ శత జయంతి వేళ రెండ్రోజుల మహానాడుకు సిద్ధం అవుతోంది. ఒంగోలు కేంద్రంగా పసుపు పండగ జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అవుతున్నాయి. ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం గుళ్లాపల్లి వద్ద గల మహి ఆగ్రోస్ ఆవరణలో ఈ వేడుక ఈ నెల 27,28 తేదీలలో జరగనుంది. జిల్లాలలో ఇప్పటికే మినీ మహానాడులు జరుగుతున్నాయి. ప్రజా నాడి పట్టుకుని గెలుపు ఎవరిది అని తేల్చేసేంత స్థాయిలో నాయకులు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో అధికారంలో ఉండగా నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకూ తామేం చేశామో పునఃశ్చరణ కూడా చేసుకుంటున్నారు. అంటే వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యే ! అధిగమించడమే బాధ్యత.
మరోవైపు వైసీపీ కూడా ప్లీనరీకి సిద్ధం అవుతోంది. జూలై లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ తరువాత పార్టీలో బోలెడు మార్పులు రానున్నాయి. అదేవిధంగా పాలన పరంగా సంస్కరణలు రానున్నాయి. ముఖ్యమంత్రి ఎట్టకేలకు మంత్రులనూ, ఎమ్మెల్యేలనూ ప్రజల మధ్యకు పంపగలిగారు. ఆ విధంగా ఇప్పుడు జనం సమస్యలు తెలుస్తున్నాయి అధికార పార్టీ వర్గాలకు..!
కొందరు అసహనంతో ఊగిపోయినా, తరువాత మీడియా కారణంగా కొంత వెనక్కు తగ్గి తప్పులు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం బాగుంది. అడ్డదిడ్డం అయిన పథకాలివి అని జనం అనొచ్చు తప్పేం లేదు కానీ మనం ఆగ్రహంతో ఊగిపోకూడదు అన్న సత్యం ఒకటి ఇప్పటికిప్పుడు గుర్తించడం కూడా వైసీపీ బాధ్యతే ! ఏ విధంగా చూసుకున్నా జగన్ గెలుపు మంత్రుల బాధ్యత.
ఇదే సమయంలో వైసీపీకి దీటుగా జనసేన బరిలో ఉంది. పవన్ ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం అని చాలా మంది మంత్రులే అంటున్నారు. బాగుంది. మీరిలానే మాట్లాడండి మాజీ మంత్రులకు పట్టిన గతే మీకూ పడుతుంది అని అంటున్నారు పవన్.అంటే వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కన్నా తమ పార్టీ జనసేననే ఎక్కువగా వైసీపీని ప్రభావితం చేయనుందా? అందుకే జగన్ లో కొత్త భయం పట్టుకుందా అని కొందరు పవన్ అభిమానులు అంటున్నారు. ఎలా చూసుకున్నా పవన్ కు కూడా ఈ ఎన్నికలు జీవన్మరణమే ! దాటుకుని రావడం అన్నది పొత్తుల ధర్మంలో భాగంగా పవన్ తో పాటు ఇతర పార్టీలది కూడా ! సాధ్యాసాధ్యాలు అంచనా వేసి ప్రజాక్షేత్రంలో విపక్ష పార్టీలు పోరాటాలు చేయాలిక. ప్రత్యర్థి పార్టీలను నిలువరించడం అంటే బూతులు తిట్టడం కాదని వైసీపీ తెలుసుకుంటే మేలు.