ఆంధ్రాలో రాజకీయ నాయకులు రోడ్డుపైనే ఎందుకు సభలు, సమావేశాలు పెడుతున్నారు..?

-

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు తారా స్థాయికి చేరాయి.. ఏదో ఒక పేరు పెట్టుకోని నాయకులు ర్యాలీలు, రోడ్‌ షోలు చేస్తున్నారు. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం రెండూ చేసేది ఒకటే పని..కానీ వాటికి పేరే వేరు. రాజకీయ నాయకుల ర్యాలీలు జరిగిన తరువాత రోజు తెలుగు పత్రికలు చూస్తే.. ‘‘నాయకుడి సభకు హాజరైన జన సందోహంలో ఒక భాగం ఉంటుంది.  ‘‘జన సముద్రం’’, ‘‘జన సునామీ’’, ‘‘జన ప్రవాహం’’ వంటి పదాలను వాడుతూ ఫోటోల కింద క్యాప్షన్స్‌.. డ్రోన్‌ కెమెరాలతో తీసిన వీడియోలు, ఫోటోలో పేపర్లు, టీవిల్లో ఉంటున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభలో చంద్రబాబు ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనలో 8 మంది చనిపోయారు. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. వైకాపా వర్గీయులు.. ఈ ఘటనను అదునుగా చేసుకుని తెదేపాపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కందుకూరులాంటి చిన్న టౌన్లో రోడ్డుపై అంత మందితో సభ జరిగింది.
ఇందులో నిర్వాహక తెలుగుదేశం తప్పు ఉందనీ, కాన్వాయ్ వేగంగా కదలడం, రోడ్డును కావాలని కుదించడం, చెప్పిన స్థలంలో కాకుండా వేరే చోట సభ పెట్టడం వల్లే ఈ ఉల్లంఘనలన్నీ జరిగాయని స్థానిక ఎస్పీ అంటున్నారు. పోలీసులే భద్రత కల్పించడంలో విఫలం అయ్యారంటూ తెలుగుదేశం పోలీసులపై ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో అసలు ఊరి మధ్యలో సభలకు ఎలా అనుమతిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.

అప్పట్లో సభలు అంటే ఎలా ఉండేవి..?

ఒకప్పుడు పెద్ద రాజకీయ నాయకుల పర్యటనల్లో కేవలం బహిరంగ సభలు మాత్రమే ఉండేవి. అంటే ఆయా పట్టణాలు, లేదా పెద్ద పల్లెల్లోని కాలేజీ గ్రౌండ్లూ, హైస్కూలు గ్రౌండ్లూ, మున్సిపల్‌ గ్రౌండ్లూ, పీడబ్ల్యూడీ గ్రౌండ్లూ.. ఇవేవీ దొరక్కపోయినా, సరిపోకపోతే పొలాల్లో సమావేశాలు పెట్టేవారు. స్టేజీ వేసి, టెంట్లు వేసేవారు. అక్కడకే జనం వచ్చేవారు. ఆ వేదిక వరకూ వెళ్లే అవకాశం లేనివారు, వెళ్లే ఉద్దేశం లేని వారు దారిలో నాయకుడు అక్కడ వరకూ యాత్రలా వెళ్లడం చూసి సరిపెట్టుకునే వారు.
దారి పొడవునా నుంచున్న వారికి కనిపించడం కోసం ఓపెన్ టాప్ జీపుల నుంచి చేతులు ఊపుతూ వెళ్లే దగ్గర నుంచి ఇప్పుడు అన్ని హంగులతో అల్ట్రా లగ్జరీలతో కూడా ప్రత్యేక బస్సులు కాలానికి వచ్చేశారు. వాహనాలు మాత్రమే కాదు, పార్టీలు కూడా అప్‌డేట్ అయ్యాయి. జనం కోసం సభ పెడితే జనాన్ని తీసుకురావాలి. అది ఖర్చు ప్రయాస. ఆ ప్రసంగం ఏదో జనం నుంచున్న చోటే ఇచ్చేస్తే సులువు – ఇలా ఆలోచిస్తోన్న పార్టీలు, దానికి తగ్గట్టే రోడ్ షోలనే బహిరంగ సభలుగా మార్చేసుకున్నాయి.

రోడ్డే సభా ప్రాంగణం..

నడిరోడ్డే సభా ప్రాంగణంగా మారిపోయింది. ‘‘ప్రజలను మీటింగు జరిగే చోటుకు తీసుకురావాలి అంటే లక్షల ఖర్చు. టెంట్ వేయాలి. స్టేజ్ వేయాలి. గతంలో 40-50 ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ, జయప్రకాశ్ నారాయణ వంటి వారు వస్తున్నారంటే, జనం లక్షమందో రెండు లక్షల మందో సొంతంగా వచ్చేవారు. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు నాయకులకు తప్ప అలా రావడం లేదు. పూర్వంలాగా జనాలను లారీల్లో తరలించే పరిస్థితి లేదు. బస్సులు, జీపులు వంటివి పెట్టాలి. ఇవన్నీ తప్పించుకోవడానికి పార్టీలు రోడ్ షోలు పెట్టేస్తున్నారు’’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
‘‘రోడ్ షోలు అంటే రోడ్డు మీద నాయకుడు వెళితే ఆ నాయకుడిని చూడ్డానికి జనం వస్తారు. అక్కడక్కడా ఆగి రోడ్డు బ్లాక్ చేస్తే, ఇంకా జనం కనిపిస్తారు. టీవీల్లో చూపించడానికి, పేపర్లో వేయడానికి మంచి ఫొటోలు, వీడియోలు దొరుకుతాయి. ఇంత జనం వచ్చారా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. 20 ఏళ్లుగా ఇదే ట్రెండు బాగా పెరిగింది.

మార్పు అలా..

రాజకీయ పార్టీల దగ్గరకు కార్పొరేట్ ఎలక్షన్ ప్లానర్లు చేరాక పరిస్థితిలో ఇంకా మార్పు వచ్చింది. అధినాయకుడి చుట్టూ ఎప్పుడూ జనం ఉండేలా, వారంతా ఆయన మీదకు ఎగబడుతున్నారని కనిపించేలా చేయడం కోసం వారు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు..వాహనాలు వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వారిని తోస్తూ హడావుడి చేయడం, ఇరుకు రోడ్లలో యాత్రలు చేయడం ఇందులో భాగాలే అని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అభిప్రాయపడుతున్నారు.

 

 

మరి దీనికి చెక్‌ పెట్టడం ఎలా..?
దీనికి ఒకటే పరిష్కారం. రోడ్ షో అంటే చేతులు ఊపుతూ వెళ్లిపోవాలి తప్ప, ఎక్కడా ఆగి ప్రసంగించే కార్యక్రమం రోడ్లపై, ఊరి మధ్యలో చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రసంగాలూ, సభలూ ఊరి బయట ఖాళీ స్థలాల్లో ఉండాలి.
సాధారణంగా రాజకీయ యాత్రలు అంటే ఊరి అవతలి నుంచి వెళ్లే బైపాస్ రోడ్లు, మున్సిపల్‌ గ్రౌండ్లు దాటి మెయిన్ రోడ్లపై మెయిన్ సెంటర్‌లో సభ పెట్టడం ఇప్పుడు మామూలూ అయిపోయింది.
అక్కడ స్టేజీ ఉండదు. ఒక టెంపో లాంటి బండిపై టాప్ చుట్టూ రెయిలింగ్ పెట్టి, నాయకులు ఎక్కడానికి మెట్లు పెడతారు. అదే బండిపై ఇరుక్కుని తోటి ఎమ్మెల్యే స్థాయి నాయకులంతా నుంచుంటే, వారి మధ్య నుంచి అధినేత మాట్లాడతున్నారు. ఆ వాహనం సరిగ్గా ఊరి మధ్యలో, బిజీగా ఉండే రోడ్డు మీద పెట్టి మాట్లాడతారు. దీంతో ఆ రోడ్డు మొత్తం నిజంగానే ఇసకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. అది అనుకోకుండా జరుగుతుందా.. ప్లాన్‌లో భాగంగానే జరుగుతుందా.. ఈ వ్యాహానికి ఏ పార్టీ తక్కువేం కాదు.. ప్రతిపక్షాలు, అధికారపక్షం రెండూ ఇలానే చేస్తున్నాయి. పార్టీలకతీతంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే చేశారు ఏమంటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version