తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పమన్నారు పెద్దలు. సరే.. ఇంతటి ధర్మాత్ములను ఈ యుగంలో ఆశించడం హాస్యాస్పదమే అవుతుంది. సో.. కనీసం తప్పును తప్పని చెప్పే పాటి ధైర్యం చేయకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచానికి రాజకీయ పాఠాలు నేర్పుతామని చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు.. వేస్తున్న అడుగులు, చేస్తున్న కామెంట్లు.. ఆయనను ఆయన సమర్ధించుకునే తీరు, పార్టీ నేతలను వెనుకేసుకు వచ్చే విధానం వంటివి తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. టీడీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పోలీసులు అరెస్టు చేశారు.
ఒకరు 151 కోట్ల రూపాయల మేరకు అవినీతి చేశారనే ఆరోపణలపై ఏసీబీకి అరెస్టయితే.. మరొకరు ఓ లోకల్ లీడర్‌ను హత్య చేశారనే కారణంగా అరెస్టు చేశారు. ఈ పరిణామాలు నిజంగానే ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి రెండు ఘటనలు కూడా టీడీపీని తీవ్రస్థాయిలో ఇరుకున పెట్టేవే. ఇద్దరు మాజీ మంత్రులు అరెస్టయితే.. పార్టీ వారిని కాపాడుకోలేక పోయిందనే అపవాదు ఒకవైపు.. ఇలా ఎంతమంది ఉన్నారో.. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది అరెస్టు అవుతారో..? అనే మీమాంశ మరోవైపు పార్టీలోనే కాకుండా జనరల్‌గా కూడా చర్చకు వచ్చింది.
ఇక, ఈ విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షాన్ని ఎలాగూ ఇరుకున పెడుతుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఎదురుదాడిని ఎంచుకోవడం.. తప్పును తప్పుగా ఒప్పుకోలేక పోవడం వంటివి ఆయన సీనియార్టీకి మాయని మచ్చగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు. కళ్లముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా… ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి.. కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని చెప్పారు చంద్రబాబు. ఇదే నిజమనుకుందాం.. కొల్లు కన్నా ఎక్కువగా విమర్శలు చేసిన నాయకులు టీడీపీలో లేరా? అంతెందుకు నిత్యం రాజారెడ్డి రాజ్యాంగం, తుగ్లక్ పాలన అంటూ.. విమర్శలు చేస్తున్న లోకేష్ లేరా? అరెస్టు చేసేందుకు! నిజానికి ఎవరైనా .. నేరం చేయకుండానే ఆరోపణలు ఎదుర్కొంటారా? పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారా? విషయాన్ని విషయంగా చూసి, తప్పును తప్పుగా ఒప్పుకొంటేనే చంద్రబాబు గౌరవం నిలుస్తుంది.. పార్టీ ప్రతిష్టా పెరుగుతుంది. కానీ, బాబు మాత్రం కర్రవిడిచి సాము చేస్తున్నారు.