ల్యాక్సటివ్స్ (విరేచనకారి మందులు) వాడితే మలబద్ధకం ఇట్టే తగ్గిపోతుందని మనందరం భావిస్తాం. కానీ చాలా మందిలో ఇవి వాడినా ఫలితం శూన్యం. 40-50% మందిలో ఈ సమస్య తగ్గకపోవడానికి వెనుక ఒక షాకింగ్ నిజం దాగి ఉంది. అదేంటంటే మలబద్ధకం అనేది కేవలం జీర్ణక్రియ సమస్య మాత్రమే కాదు, అది మీ కండరాల పనితీరుకు సంబంధించిన లోపం కూడా కావచ్చు. మందులు వేసుకున్నా పరిష్కారం దొరకని ఆ ‘గుప్త’ కారణం ఏంటో, దాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సమస్య ఇదే : చాలా మంది మలబద్ధకం అనగానే ఫైబర్ తక్కువైందని లేదా నీళ్లు తక్కువ తాగుతున్నామని అనుకుంటారు. కానీ ల్యాక్సటివ్స్ వాడినా ఫలితం లేని 40-50% మంది రోగులలో “పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్” (Pelvic Floor Dysfunction) లేదా “డిస్సినర్జిక్ డెఫికేషన్” అనే సమస్య ఉంటుంది.
సాధారణంగా మనం మల విసర్జన చేసే సమయంలో, మన పొత్తికడుపు కండరాలు ఒత్తిడిని కలిగించాలి మరియు మలద్వారం వద్ద ఉండే కండరాలు (Sphincter muscles) వదులుగా (Relax) అవ్వాలి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో, కండరాలు రిలాక్స్ అవ్వడానికి బదులుగా బిగుసుకుపోతాయి. దీనివల్ల విసర్జన మార్గం మూసుకుపోయి, మలం బయటకు రాకుండా అడ్డుకుంటుంది. ల్యాక్సటివ్స్ కేవలం మలాన్ని మెత్తగా చేస్తాయి లేదా కదలికను పెంచుతాయి, కానీ కండరాల ఈ ‘రాంగ్ సిగ్నలింగ్’ను మార్చలేవు.

మీరు గమనించాల్సిన లక్షణాలు: విరేచనానికి వెళ్ళినప్పుడు విపరీతంగా ముక్కాల్సి రావడం (Straining).విరేచనం అయినా కూడా ఇంకా లోపల ఏదో మిగిలిపోయిందనే అసంతృప్తి (Incomplete evacuation). మలాన్ని చేత్తో లేదా వేలితో నొక్కి బయటకు తీయాల్సి రావడం. మలద్వారం వద్ద ఏదో అడ్డుపడినట్లు అనిపించడం.
పరిష్కారం ఏమిటి?: ఇలాంటి పరిస్థితుల్లో మందుల కంటే “బయోఫీడ్‌బ్యాక్ థెరపీ” అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో నిపుణులు మీ కండరాలను ఎలా సరిగ్గా రిలాక్స్ చేయాలో శిక్షణ ఇస్తారు. అలాగే సరైన సిట్టింగ్ పొజిషన్ (కాళ్ళ కింద స్టూల్ వేసుకోవడం) కూడా కొంతవరకు సహాయపడుతుంది.
గమనిక:కేవలం పైన ఇచ్చిన సమాచారం అవగాహన కోసం మాత్రమే, ఏదయినా సమస్య వుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
