టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను ఎందుకు పెంచుతున్నాయి..? జియో వ్యూహమేనా..?

-

సాధారణంగా ఏ కంపెనీ అయినా సరే కొత్తగా వస్తే.. కస్టమర్లందరినీ తనవైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి..? తన సేవలను చాలా తక్కువ ఖరీదుకే ఇవ్వాలి. దీంతో వాటికి కస్టమర్లు బాగా అలవాటు పడతారు.

టెలికాం రంగంలో జియో సునామీలా దూసుకువచ్చినప్పటి నుంచి ఇతర టెలికాం కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. అంతకు ముందు కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు, రోమింగ్‌కు ఇబ్బడిముబ్బడిగా చార్జిలు వేసి ఆయా కంపెనీలు కస్టమర్ల జేబులను గుల్ల చేశాయి. జియో రాకతో ఆయా సేవల చార్జిలు భారీగా తగ్గాయి. దీంతో ఇతర కంపెనీలు కూడా కస్టమర్లు తమ నెట్‌వర్క్‌ల నుంచి చేజారిపోకుండా ఉండేందుకు తమ సేవల చార్జిలను తగ్గించక తప్పలేదు. అయితే ఏం చేసినా.. ఆ కంపెనీలు జియో ముందు నిలబడలేకపోతున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు నష్టాలను చవి చూస్తున్నాయి. అయితే ఇదంతా అందరికీ తెలుసు. కానీ నిజానికి ఈ విషయాన్ని జియో ఎప్పుడో గ్రహించిందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

సాధారణంగా ఏ కంపెనీ అయినా సరే కొత్తగా వస్తే.. కస్టమర్లందరినీ తనవైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి..? తన సేవలను చాలా తక్కువ ఖరీదుకే ఇవ్వాలి. దీంతో వాటికి కస్టమర్లు బాగా అలవాటు పడతారు. ఈ క్రమంలో ఇతర కంపెనీలు కూడా తమ సేవలను తక్కువ ధరలకే అందిస్తాయి. అయితే అది అన్ని కంపెనీలకు అచ్చిరాదు. దీంతో వాటికి నష్టాలు వస్తాయి. తరువాత అవి తమ చార్జిలను పెంచుతాయి. లేదా యథావిధిగా గతంలో ఉన్న రేట్లనే వసూలు చేస్తాయి. అప్పుడు సేవలను తక్కువ రేట్లకే ఇచ్చిన ఆ కంపెనీ కూడా అమాంతం రేట్లను పెంచుతుంది. దీంతో లాభాలు విపరీతంగా వస్తాయి. అవును.. సరిగ్గా జియో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించింది. సక్సెస్ అయింది.. కానీ ఇతర టెలికాం కంపెనీలు జియో వ్యూహాన్ని పసిగట్టలేక చతికిలపడ్డాయి. ఫలితంగా వేల కోట్ల నష్టాలతో దివాలా తీసేందుకు ఆ కంపెనీలు రెడీగా ఉన్నాయి. తాజాగా వొడాఫోన్ కంపెనీ తమ కార్యకలాపాలను భారత్‌లో నిలిపివేస్తామని చూచాయగా చెప్పిందంటే.. పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక జియో ఆరంభంలో కొంత నష్టాలకు లోనైనా.. క్రమ క్రమంగా తన నాణ్యమైన సేవలతో ఉన్న కస్టమర్లను చేజారిపోకుండా చూసుకోవడంతోపాటు.. ఎన్నో కోట్ల మంది కొత్త కస్టమర్లను ఒడిసిపట్టుకుంది. ఇక జియో సేవలు ఎలాగూ బాగున్నాయి కనుక జనాలు కూడా బాగా అలవాటు పడ్డారు. ఒకప్పుడు 3జీ లేదా 4జీ నెట్‌వర్క్ రావాలంటే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఒకవేళ మొబైల్ ఇంటర్నెట్ సరిగ్గా వచ్చినా.. ఆ డేటా చార్జిలు మరీ ఎక్కువగా ఉండేవి. దీంతో కస్టమర్లు సాధారణంగా జియో అందిస్తున్న చీప్ డేటా ప్లాన్లకు అలవాటు పడ్డారు. అయితే ఇక్కడే జియోకు కలిసివచ్చింది. అంత తక్కువకు మొబైల్ డేటా ఇచ్చే సరికి కస్టమర్లు జియోకు విపరీతంగా పెరిగారు. మరోవైపు కాల్స్ కూడా ఫ్రీ కావడంతో చాలా మంది జియో నెట్‌వర్క్‌కు మారారు. అయితే ముందు నుంచీ జియో ఈ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసింది. ఇక ఇతర టెలికాం కంపెనీలు ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోయాయి. దీంతో జియోతో కొనసాగిన వార్‌లో ఆ కంపెనీలు ఓడిపోయి నష్టాలబాట పట్టాయి.

ఈ క్రమంలో ఆ కంపెనీలు తిరిగి గాడిలో పడాలంటే ఇప్పుడు మొబైల్ టారిఫ్‌లను పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే దీన్ని అదునుగా చూసుకుని, ఈ విషయాన్ని సాకుగా చూపి.. జియో కూడా బాదుడుకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడు కస్టమర్లు జియోను ఈ విషయంపై ప్రశ్నించినా.. ఇతర కంపెనీలు పెంచుతున్నాయి కదా.. తాము కూడా నష్టాలను పూడ్చుకునేందుకు పెంచుతున్నామని చెబుతాయి. ఎలాగూ జియో చేయనున్నది అదే కదా.. దీంతో జియోకు ఇప్పుడు వస్తున్న లాభాలు మరింత పెరుగుతాయి. ఏది ఏమైనా.. టెలికాం రంగంలో జియో కొట్టిన దెబ్బకు ఇతర కంపెనీలు తమ దుకాణాలను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది వాస్తవం. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version