కేవీపీ రామచంద్రారావు అంటే..సలహాలు, సూచనలు ఇచ్చే నాయకుడు అని అందరికీ తెలుసు. అలాగే గతంలో వైఎస్సార్ సలహాదారుడుగా ఉంటూ..ఆయనకు సన్నిహితుడుగా ముందుకెళ్లారు. ఒకానొక సమయంలో కేవీపీ అంటే వైఎస్సార్ ఆత్మ అనే విధంగా కూడా ప్రచారం జరిగింది. అంటే వైఎస్సార్-కేవీపీలు అంత సన్నిహితంగా ఉండేవారు. అయితే వైఎస్సార్ చనిపోయాక కేవీపీ..జగన్‌తో కలిసి నడుస్తారని అంటా అనుకున్నారు. కానీ రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కేవీపీ వదలలేదు.
ఆ పార్టీలోనే ఇప్పటికీ పనిచేస్తున్నారు. అలాగే జగన్‌కు పరోక్షంగా సాయం చేసే విషయంపై క్లారిటీ లేదు గాని..ఎప్పుడూ కూడా జగన్‌ని ఒక్క మాట అనరు. అలాగే ఎలాంటి సలహాలు సూచనలు కూడా పెద్దగా ఇచ్చినట్లు కనబడరు. కానీ తాజాగా కేవీపీ..జగన్‌కు పోలవరంకు సంబంధించి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయాలని జగన్‌కు లేఖ రాశారు.
ఈ నెల 29న కేంద్రం సమక్షంలో జరిగే సమావేశంలో గట్టిగా డిమాండ్ చేయాలని, కేంద్రం తీరు వల్లే పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కరకట్టల నిర్మాణానికి ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని, ఈ విషయంలో జగన్ పోరాటం చేయాలని సూచిస్తున్నారు.
అయితే ఇప్పుడు పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తోంది.. ఈ నిర్మాణం ఖర్చు అంత కేంద్రానిదే. కానీ నిధులు ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేస్తుంది. అలాగే పోలవరంకు సంబంధించి పక్క రాష్ట్రాలు అడ్డంకి పెడుతుంటే…వారికి కేంద్రం సర్ది చెప్పడం లేదు. కాబట్టి ఈ అంశాలపై జగన్ పోరాటం చేయాలని కేవీపీ సూచిస్తున్నారు. మరి కేవీపీ సూచనని జగన్ పాటిస్తారా? అంటే కష్టమనే చెప్పాలి..కేంద్రంపై జగన్ గట్టిగా గళం విప్పే పరిస్తితి కనిపించడం లేదు. అటు చంద్రబాబుది అదే పరిస్తితి. ఇలా నోరు విప్పకే రాష్ట్రం చాలా కోల్పోయింది. ఇప్పుడు రైల్వే జోన్ కోల్పోయింది. మరి జగన్,చంద్రబాబు ఎప్పుడూ నోరు విప్పుతారో చూడాలి.