అవును! ఇప్పటి వరకు ఏడాదిన్నరగా పాలనను ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు ప్రజల్లోకి రావాల్సిన అవసరం..వారి గోడును వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు ప్రజల్లోనే ఉన్నారు జగన్. దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించారు. దీనికి ముందు ఓదార్పు యాత్రలు చేశారు. ఇక, ఏడాదిన్నర కిందట పాలనా పగ్గాలు చేపట్టాక.. ఒక్కసారి కూడా ప్రజల మధ్యకు కురాలేదు. ఇది ఆయనకు మైనస్‌గా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒకటి.. ఆయన ఎంతో ఉత్తమంగా పాలన అందిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రజల పరిస్థితిన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు పాలన అందిస్తున్న సమయంలోనూ ఆయన నేరుగా ప్రజలను కలుసుకునేందుకు ప్రతిమూడు నెలలకు ఒకసారి సమయం వెచ్చించేవారు. ఏదో ఒక కార్యక్రమం రూపంలో బహిరంగ సభలు పెట్టేవారు. ప్రజానాడిని పట్టుకునేవారు. అయితే, ఇది ఆయనకు గెలుపునిచ్చిందా.?. ఇవ్వలేదా ? అనేది పక్కన పెడితే.. బాబు మంచి వ్యక్తి, మంచి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అనేపేరును మాత్రం సుస్థిరం చేసింది.
ఎప్పుడూ ఏదో ఒక హంగామాతో చంద్రబాబు ప్రజల్లోనూ, పబ్లిసిటీలోనూ బాగా నానేవారు. అయితే, ఇప్పుడు జగన్ విషయంలో అలా లేదు. ఆయన తాడేపల్లిలోని రాజసౌధం నుంచి బయటకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీనిని ప్రతిపక్షాలు కూడా బలంగానే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. జగన్ కేవలం ఇంట్లోనే ఉంటారని పబ్జీ గేమ్‌తో సరిపెడతారని, టీడీపీ, వామపక్షాల నాయకులు కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక, స్థానికంగా వైసీపీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా ఆరోపిస్తున్నారు.
పైగా ప్రజల్లోనూ ప్రభుత్వ పథకాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందనే భావన వ్యక్తమవుతోంది. కొందరికే ప్రభుత్వం అండగా ఉందని, మిగిలిన వారిని గాలికి వదిలేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కొన్నిరోజుల పాటైనా ప్రభుత్వ పాలనను పక్కన పెట్టి.. ప్రజాబాట పట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పరిశీలకులు. మరి జగన్ వ్యూహం ఏంటో చూడాలి.
-Vuyyuru Subhash