ఏపీలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు హామీలు ఇచ్చారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఒక కొలిక్కి రాలేదు. ప్రస్తుతం పాలనా పరమైన సంస్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టిన జగన్ ఆ దిశగానే దూసుకుపోతున్నారు.
ఇక ఇప్పుడు జగన్ జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. 2020 జనవరి 26న కొత్తజిల్లాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలు వైశాల్యంలో చాలా పెద్దగా ఉండడంతో పాలనా పరంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పనులకు సైతం జిల్లా కేంద్రాలకు రావాలంటే రోజుల టైం వేస్ట్ అవుతోంది.
తెలంగాణలో ఆ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న 10 జిల్లాలను కేసీఆర్ ఏకంగా 33 జిల్లాలుగా మార్చేశారు. దీంతో అక్కడ పాలన ప్రజలకు మరింత దగ్గరైంది. ఇప్పుడు జగన్ సైతం కొత్త జిల్లాల ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. అయితే కేసీఆర్‌లా కాకుండా జగన్ ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో ఒక అసెంబ్లీ నియోజకవర్గమే ఏకంగా మూడు జిల్లాల్లోకి వెళ్లిపోయింది.
అయితే ఇక్కడ ఏర్పాటు చేసే జిల్లాల వల్ల కూడా చాలా సమస్యలు ఉన్నాయి. లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుంటే జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేరే జిల్లాల్లోకి వెళ్లిపోతాయి. సంతనూతలపాడు నియోజకవర్గం అంతా ఒంగోలుకు దగ్గరే.. అయితే అది బాపట్ల లోక్‌సభలో ఉంటుంది. ఇక విజయవాడకు ఆనుకుని ఉండే పెనమలూరు, గన్నవరం మచిలీపట్నం జిల్లాలోకి వెళతాయి.
ఏలూరుకు దగ్గరగా ఉండే ద్వారకాతిరుమల మండలం ఎక్కడో ఉన్న రాజమహేంద్రవరం జిల్లాలో కలుస్తుంది. అరకు ఏకంగా నాలుగు జిల్లాల్లో ఉంది. దానిని జిల్లా చేసినా ఇప్పుడున్న జిల్లా కేంద్రాల కంటే ప్రతి ఒక్క నియోజకవర్గం వారికి దూరం అవుతుంది. నెల్లూరుకు పక్కనే ఉన్న సర్వేపల్లి తిరుపతిలో కలుస్తుంది. ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. మరి వీటిని జగన్ ఎలా సర్దుబాటు చేస్తారో ? చూడాలి.
ఇక కొత్త జిల్లాల పేర్లు చూస్తే హిందూపురం,రాజంపేట, తిరుపతి నంద్యాల, విజయవాడ, నరసాపురం, రాజమండ్రి. అరకు, అనకాపల్లి, నరసరావుపేట, అమలాపురం, బాపట్ల అంటే ఇప్పుడు ఉన్న 13 జిల్లాలకు మరో 12 జిల్లాలు కలిసి మొత్తం 25 జిల్లాలు ఏర్పడతాయి.