గంటలో పెళ్లి.. ఎదురుకట్నం కావాలన్న వధువు.. షాక్​లో వరుడు

-

గంటలో పెళ్లి.. వివాహ మండపానికి పెళ్లి కుమారుడు కుటుంబం, బంధువులతో సహా వచ్చాడు. కాసేపట్లో వధువు మెడలో తాళికట్టి కొత్త జీవితం ప్రారంభిస్తాననే ఆశతో ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కానీ తాను మండపానికి వచ్చి చాలా సేపైనా వధువు తరఫు వారి ఊసే లేదు. ఏమైందని ఆరా తీసిన వరుడికి ఊహించని షాక్ తగిలింది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది.

గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌కు ముహూర్తానికి ముందే చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరా తీశారు.

అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్‌ చేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news