బంగారం స్మగ్లర్లు దాన్ని దొంగ రవాణా చేయడానికి పడరానిపాట్లు పడుతున్నారు. ‘కాదేది కవితకు అనర్హం’ అన్న చందంగానే దొంగ బంగారం రవాణా చేయడానికి కూడా మనిషి శరీరంలోని ఏ పార్టును వదలడం లేదు. గొంతు, పొట్ట, నోరు చివరికి మలద్వారం, మర్మావయవం.. ఇలా ఎక్కడ పడితే అక్కడ బంగారం దాచుకుని అక్రమ రవాణా చేస్తున్నారు. ఎన్నిసార్లు ఏయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు చిక్కినా వారి విక్రమార్క ప్రయత్నాలను మాత్రం మానుకోవడం లేదు.
తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. మర్మావయవంలో దొంగ బంగారం దాచుకుని బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ కోల్‌కతాలోని సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారులకు చిక్కింది. మహిళ నడకలో తేడాను గమనించిన అధికారులు ఆమెను తనిఖీ చేసి బాడీలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇంటెన్సివ్ సెర్చ్ క్యాబిన్‌లోకి తీసుకెళ్లి స్కాన్ చేయడంతో.. ప్లాస్టిక్ కవర్‌లో పొడి రూపంలో ఉన్న 500 గ్రాముల దొంగ బంగారం బయటపడింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను, బంగారం ప్యాకెట్‌ను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
‘పర్వీన్ సుల్తానా అనే మహిళ బంగారం పౌడర్‌ను ఓ ప్లాస్టిక్ కవర్‌లోపెట్టి మర్మావయవాల్లో దాచుకుందని, దాన్ని శానిటరీ నాప్కిన్‌తో కవర్ చేసిందని, ఆమె నడకతీరు తడబడటంతో అనుమానించి తనిఖీ చేశామని, ఆమె నుంచి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని’ సీఐఎస్‌ఎఫ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రష్మీ గురుంగ్ తెలిపారు.