పాములు అంటే సహజంగానే ఎవరికైనా భయం ఉంటుంది. కొందరైతే ఇంకా విపరీతంగా భయపడిపోతారు. దాన్ని చూస్తేనే బెంబేలెత్తిపోతారు. అది ఎక్కడ మీద పడి కాటు వేస్తుందేమోనని హడలెత్తిపోయి గంతులేస్తూ పరుగులు పెడతారు. అయితే ఆ మహిళ మాత్రం తన ఇంటి దగ్గర తచ్చాడుతున్న పామును చూసి ఏకంగా 2 రోజుల పాటు ఇంటి నుంచి బయటికే రాలేదు. అయితే ఆ తరువాత విషయం తెలిసి ఆ మహిళ అవాక్కయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
యూకేలోని హాంప్‌షైర్స్ ఫ్లీట్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళకు సడెన్‌గా తన ఇంటి దగ్గర పాము కనిపించింది. ఆ తరువాత కొంత సేపటికి ఆ పామును ఆమె తన ఇంటి కిటికీలో చూసింది. అంతే.. ఆమె హడలెత్తిపోయింది. అనంతరం 2 రోజుల పాటు ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. చివరకు ఆమె స్థానికంగా ఉన్న రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (ఆర్‌ఎస్‌పీసీఏ) సంస్థకు ఫోన్ చేసింది.
ఆ మహిళ ఫోన్ చేయగానే వారు వచ్చి చూసి షాకయ్యారు. ఎందుకంటే ఆమె ఇంటి వద్ద ఉన్నది అసలు పాము కాదు.. బొమ్మ పాము. పసుపు, నలుపు రంగులు కలగలిపి ఉన్న బొమ్మ పాము అది. దీంతో ఆ బొమ్మ పామును తీసుకెళ్లి ఆ మహిళకు చూపించగా ఆమె ఆశ్చర్యపోయి అవాక్కయింది. ఆ తరువాత వారు ఆ బొమ్మ పామును తమ వెంట తీసుకెళ్లారు. ఆ మహిళను భయపెట్టేందుకే ఎవరో కావాలనే అలా చేసి ఉంటారని సదరు సంస్థ వారు నిర్దారించారు. ఏది ఏమైనా.. ఇలాంటి సంఘటనలు ఎవరికీ ఎదురు కాకూడదు కదా..!