సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో దారుణం జరిగింది. ఓ ప్రమోన్మాది 24 ఏండ్ల యువతిని అతి కిరాతకంగా హత్యచేశాడు. ఏండ్ల కొద్ది ప్రేమిస్తున్నాంటూ వేధిస్తున్నాడు. ఆమె హెచ్చరించినా, ఆమె తల్లిదండ్రులు మందలించినా, చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని బుద్ధి మార్చుకోలేదు. అయితే, ఇటీవల ఆ యువతికి పిండ్లి కుదిరిందని తెలియడంతో కక్ష్యలో రగిలిపోయాడు. మరో వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఆమెను.. మంగళవారం సాయంత్రం వెంబడించి ఇంట్లోనే గొంతుకోసి పారిపోయాడు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. ఈ కుటుంబం దివ్య ఏడో తరగతి పూర్తికాగనే వేములవాడకు మకాం మార్చారు. అయితే అక్కడ వెంకటేష్ గౌడ్ అనే యువకుడు దివ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడంతో మళ్లీ ఎల్లారెడ్డిపేటకే తిరిగొచ్చారు. వెంకటేశ్ గౌడ్ అక్కడికి కూడా వెళ్లి దివ్య వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దివ్య జోలికి వెళ్లకూడదంటూ పేపర్ రాయించుకుని పంపించారు.
దీంతో కొన్నిరోజులపాటు దివ్య జోలికి వెళ్లకుండా ఉన్న వెంకటేష్.. ఆ తర్వాత మళ్లీ వెంట పడడం మొదలుపెట్టాడు. అయినా, అతడిని పట్టంచుకోకుండా దివ్య ఉన్నత చదువులు చదివి 4 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు గజ్వేల్ బ్రాంచ్‌లో ఉద్యోగం సంపాదించింది. దీంతో దివ్య తల్లిదండ్రులు కూడా గజ్వేల్‌కు వచ్చి ఉంటున్నారు. ఇటీవలే దివ్యకు వరంగల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 26న వివాహం జరగాల్సి ఉండటంతో.. పెండ్లి ఏర్పాట్లు చేసేందుకు తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లారు.
అయితే, మంగళవారం సాయంత్రం దివ్య విధులు ముగించుకుని ఎప్పటిలాగే ఇంటికి వెళ్లింది. అయితే వెంకటేష్ తనను అనుసరిస్తూ ఇంటివద్దకు చేరుకున్న విషయాన్ని గమనించని దివ్య మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి వస్తుండగా.. వెంకటేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అంతటితో ఆగక ఇష్టమొచ్చినట్లు పొడిచాడు. దీంతో దివ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూతురు దారుణహత్యకు గురైందని తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమను వదిలేసి పోయిందని బోరున విలపించారు.
ఇదిలావుంటే దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. నిందితుడి ఆచూకీ స్పెషల్ టీమ్స్ ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు.