లింగయ్య.. యువకుడు.. టాలెంటెడ్. తెలంగాణకు చెందిన లింగయ్య ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందులోని యాసిడ్ ప్లాంట్ లో కన్వేయర్ బెల్డ్ ను ఆపరేట్ చేయాలి. తన ఉద్యోగ జీవితం బాగానే గడుస్తున్న తరుణంలో ఓ రోజు అకస్మాత్తుగా ప్లాంట్ స్టార్ట్ అయింది. దీంతో లింగయ్య కన్వేయర్ బెల్ట్ పై పడటంతో అతడి చేయి విరిగిపోయింది. ముందుగా ఏదో లోకల్ ఆసుపత్రిలో అతడిని చేర్పించినప్పటికీ.. తర్వాత అతడి తోటి వర్కర్లు కంపెనీ ముందు ధర్నా చేయడంతో సిటీ లోని పెద్ద ఆసుపత్రిలో చేర్పించింది కంపెనీ యాజమాన్యం.
ఓ 10 నెలల వరకు అతడికి మెడికల్ స్టయిపెండ్ ఇచ్చారు కంపెనీ వాళ్లు. తర్వాత అది కూడా ఆపేశారు. ప్రస్తుతం అతడికి జాబ్ లేదు. ఇచ్చే వాళ్లు లేరు. ఇల్లు గడిచేది లేదు. దీంతో నడిరోడ్డు మీద పడ్డాడు ఆ యువకుడు. ఇది ఒక్క లింగయ్య కే కాదు.. చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యే. ఎక్కువగా ఇండస్ట్రీలలో పనిచేసే వాళ్లు, ప్రమాదకరమైన మిషిన్ల దగ్గర పని చేసే వాళ్లు, కెమికల్స్ దగ్గర పనిచేసేవాళ్లకు దినదిన గండమే ఆ పని.
కానీ.. చట్టం ఏం చెబుతున్నదంటే.. వర్క్ మెన్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం.. ప్రతి ఉద్యోగికి అతడు కాంట్రాక్ట్ ఉద్యోగి అయినా సరే (క్యాజువల్ ఉద్యోగిని తప్పించి) అతడు తన బాధ్యత నిర్వర్తణ సమయంలో ఎటువంటి ప్రమాదం ఏర్పడినా.. యాక్సిడెంట్ అయినా కంపెన్సేషన్ ఇవ్వాలి. అయితే.. చాలామందికి కంపెన్సేషన్(నష్టపరిహారం) గురించి తెలియదు. కంపెనీ నుంచి నష్టపరిహారం కోసం లీగల్ గా ఎలా వెళ్లాలనే విషయం కూడా తెలియదు. ప్రమాదం జరిగి ఆ ఉద్యోగి తిరిగి పని చేయలేకపోయినప్పుడు కూడా కంపెనీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కాని.. వాటి గురించి వివరంగా తెలుసుకోవాల్సిందే.
వర్క్ మెన్ కంపెన్సేషన్ యాక్ట్ పర్పస్ ఏంటంటే?
చాలామంది యువకులు మ్యానుఫాక్సరింగ్ యూనిట్లు, ఫ్యాక్టరీల్లో పని చేస్తుంటారు. ఉద్యోగులకు ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీదే. కాని.. అకస్మాత్తుగా, అనుకోకుండా కంపెనీల్లో ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం.. ఆ ఉద్యోగికి, అతడి ఫ్యామిలీకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా కంపెనీ యాజమాన్యం చూసుకోవడం కోసం ఏర్పాటు చేసిన చట్టమే ఇది.
ఉద్యోగులకు నష్టపరిహారం ఎప్పుడు అందుతుంది?
వర్క్ మెన్ కంపెన్సేషన్ యాక్ట్ (డబ్ల్యూసీఏ) ప్రకారం.. ఉద్యోగి తన బాధ్యతను నిర్వర్తిస్తున్న సమయంలో చనిపోయినా, శాశ్వత వికలాంగుడిగా మారినా, తాత్కాలిక వికలాంగుడిగా మారినా అతడికి కంపెనీ నష్టపరిహారం అందిస్తుంది. అయితే.. ప్రమాద తీవ్రతను బట్టి నష్టపరిహారం మారుతుంది.
ఉద్యోగుల రక్షణ కోసం కంపెనీ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు..
ప్రతి ఉద్యోగి సంరక్షణ కోసం కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మిషినరీ చుట్టూ ఫెన్సింగ్ లాంటివి పెట్టడం, యువకులను ప్రమాదకరమైన యంత్రాల దగ్గర ఉంచకపోవడం, లిఫ్టులు సరిగ్గా పని చేసేలా చూడటం, కాటన్ ఓపెనర్ల ముందు మహిళలు, పిల్లలను ఉంచకపోవడం, పవర్ కట్ సమయంలో జనరేటర్ లాంటి సరైన ఎక్విప్ మెంట్ ను వాడటం, అగ్ని ప్రమాదం లాంటివి సంభవించకుండా కంపెనీ జాగ్రత్త పడాలి.
కంపెనీ నిర్వర్తించాల్సిన బాధ్యతలు
చట్టం ప్రకారం ప్రమాదానికి గురైన ఉద్యోగికి సరైన నష్టపరిహారం అందించాలి. నోటీసు ఇచ్చిన 30 రోజుల్లోగా కమిషనర్ కు స్టేట్ మెంట్ అందించాలి. ఉద్యోగి నష్టపరిహారానికి అర్హుడా కాదా? దానికి సంబంధించిన వివరాలను కమిషనర్ కు అందించాలి. ఉద్యోగులు కూడా తమ ప్రమాదానికి సంబంధించి కమిషనర్, కంపెనీకి నోటీసు పంపించాలి. నష్టపరిహారానికి సంబంధించిన వివరాలను అందులో పొందుపర్చాలి. ప్రతి ఉద్యోగి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి.