ప్రపంచంలో అతిపెద్ద ధ్యానమందిరం విశేషాలు…!

-

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం హైదరాబాద్ నగర శివారులో ప్రారంభం కానుంది. మంగళవారం దీనిని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. దీనికి కన్హా శాంతివనంగా నామకరణం చేసారు. ఈ శాంతి వనంలో నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు మూడు రోజుల పాటు, సామూహిక ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తారు.

దీనిలో లక్షా 20 వేల మంది వరకు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కన్హాశాంతివనాన్ని ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌ గైడ్‌ దాజీలు ప్రారంభిస్తారు. ఒకసారి దీని నిర్మాణం చూస్తే, 1400 ఎకరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఏర్పాటు చేయగా… 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. సెంట్రల్‌హాల్‌, 8 సెకండరీహాల్స్‌ సహా మొత్తం 9 హాల్స్‌ను నిర్మించారు.

ప్రపంచ వ్యాప్తంగా ధాన్య కేంద్రాల గురించి చూస్తే, దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 2వేల మందికి మాత్రమే సరిపోయే ధ్యాన కేంద్రం ఉంది. కన్హా శాంతి వామనంలో ఒకేసారి లక్ష మందికి పైగా ధ్యానం చేసుకునే సదుపాయం ఉంటుంది. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ 75వ వార్షికోత్సవంలో భాగంగా తాబేలు ఆకారంలో దీనిని నిర్మించారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ మొదటి గైడ్‌ లాల్జీకి ఈ శాంతి వనాన్ని అంకితమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన భారత రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌, ఫిబ్రవరి 7న సామాజిక కార్యకర్త అన్నాహజారేలు ప్రసంగించునున్నారు. దీనికి మరో ప్రత్యేకత ఉంది. ఈ శాంతివనం రాత్రి సమయంలో కాంతుల్లో తళుకుమనుతు సిడ్నీహార్బర్‌లా చూపరులను కనివిందుచేస్తోంది. అంతే కాకుండా, 40 వేల మందికి అతిథ్యమిచ్చే క్యాంపస్‌లో, రోజుకు లక్ష మం దికి భోజనాలు పెట్టే వంటగదులు ఏర్పాటు చేసారు.

అదే విధంగా 350 పడకల సామర్థ్యం గల ఆయుష్‌ ఆస్పత్రి, 6 లక్షల మొక్కలతో కూడిన నర్సరీలు ఇదే ప్రాంగణంలో నిర్వాహకులు ఏర్పాటు చేయడం విశేషం. దీనితో ఒక్కసారిగా హైదరాబాద్ మరోసారి ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ ధ్యాన కేంద్రం మంచి లెర్నింగ్‌ సెంటర్‌గానే కాకుండా, ప్రశాంతత సమకూర్చే వనంగా సేవలందిస్తుందని సదరు శాంతివనం నిర్వాహకులు స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version