లక్ష్మీ కటాక్షం కావాలంటే వీటిని పూజించండి !

-

ధనం.. సర్వం ధనమయమే. ధనం లేనిది ప్రపంచంలో ఏదీ లేదు. కొందరికి ధనం మీద వ్యామోహం ఉండవచ్చు. కొందరికి డబ్బు పట్ల వ్యామోమం లేకపోవచ్చు. విలాసంగా జీవించాలన్న ఆశ లేకపోవచ్చు. కానీ ఈ లోకంలో జీవించాలంటే… పొద్దున లేచిన దగ్గర నుంచీ డబ్బుతోనే పని. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. ఆయా శాస్త్ర్రాలలో, పురాణాలలో చెప్పిన పూజలను గురించి తెలుసుకుందాం…
తామరపూలు
లక్ష్మీదేవి సముద్ర మధనంలో ఆవిర్భవించిందని పురాణోక్తి. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామరగింజలతో పూజిస్తే మంచిదని అంటారు. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ, లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది పండితుల మాట. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదం.


నేతిదీపాలు
అంధకారం అజ్ఞానానికీ, దారిద్ర్యానికీ చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడిపంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా, జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి. ప్రతీరోజు లేదా కనీసం శుక్రవారం అయినా ఆవునెయ్యితో దీపారాధన చేస్తే అమ్మ అనుగ్రహం ఉంటుంది.
శ్రీఫలం
పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి… ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది. ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు. కొందరు మారేడు కాయను శ్రీఫలంగా పూజిస్తారు. ఎవరికి ఏది అవకాశం ఉంటే దాన్ని పూజించవచ్చు.
శ్రీసూక్తం
అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ మోగుతుండేలా చూసినా శుభప్రదమే. చదవడం రాకుంటే భక్తితో విన్నా ఫలితం వస్తుంది.
శ్రీచక్రం
శ్రీవిద్యలో లేదా తంత్రవిద్యలో శ్రీచక్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే ‘మేరు ప్రస్తారం’ అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీయంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం. అయితే దీన్ని పూజవిధానం పెద్దలు లేదా పండితుల దగ్గర తెలుసుకుని నియమనిష్టలతో చేయాలి. శుచి, శుభ్రత, శౌచనియమాలు తప్పనిసరిగా పాటించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version