కొత్త సంవత్సరం మొదలైన 4 రోజుల్లోనే టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. వరల్డ్ నంబర్ వన్ గా సౌత్ ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన కీలకమైన కేప్‌టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను సమం చేసి 12 కీలక పాయింట్లు సాధించింది. దాంతో, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-25 టేబుల్ లో మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం ఇండియా 54.16 విజయాల శాతంతో టాప్‌లో ఉండగా.. 50 శాతంతో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా 2,3 స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది జరిగిన టెస్టు మేస్ ను తన్నుకుపోయిన ఆసీస్ 4 వ స్థానం దక్కించుకోగా.. న్యూజిలాండ్‌పై తొలి టెస్టు విజయంతో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ 5 వ స్థానంలో నిలిచింది.
గత ఏడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి అనంతరం టీం ఇండియా.. వెస్టింటిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ సమం చేసింది. దాంతో డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో పాకిస్థాన్‌తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం లో నిలిచింది. 2024 ఆరంభంలోనే సౌత్ ఆఫ్రికాపై సంచలన విజయంతో ఇండియా మళ్లీ నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది.