యాదాద్రిలో వార్షిక జయంత్యుత్సవాలు రేపటి నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. పాంచరాత్రాగమ విధానాలతో ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో గీత వెల్లడించారు. ఈ నెల 2న ఉదయం 9:30 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివచనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ పర్వాలను చేపడతారు.
అలంకార సేవోత్సవంలో ఉదయం స్వామిని తిరుమలేశుని రూపంతో, సాయంత్రం పరవాసుదేవ అలంకరణతో గరుడోత్సవం నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం కాళీయ మర్దనుడి అలంకార సేవ, లక్ష పుష్పారాధన, సాయంత్రం స్వామికి హనుమంత వాహనంపై శ్రీరామావతారంలో మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. చివరి రోజు జయంత్యుత్సవం జరుగుతుంది. పాతగుట్ట ఆలయంలోనూ వేడుకలు జరుగుతాయి.
మరోవైపు నూతన సచివాలయంలోని తన కార్యాలయంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయంపై రూపొందించిన కాఫీటేబుల్ బుక్‌ను, కవితా నీరాజనం పేరిట యాదగిరి లక్ష్మీనరసింహ శతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైటీడీఏ ఛైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి… యాదాద్రి లడ్డూ ప్రసాదాన్ని సీఎంకు అందజేశారు.