రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థికశాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో యనమల తాజాగా బుగ్గనకు లేఖాస్త్రం సంధించారు. శాసనమండలిలో విపక్ష నేత హోదాలో తాను అడిగిన వివరాలు ఇవ్వాలని బుగ్గనను కోరారు. బుగ్గనకు రాసిన లేఖలో యనమల 2021-22 సంవత్సర కాగ్ నివేదికను ప్రస్తావించారు. 67 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ సంస్థకు లెక్కలు సమర్పించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 30 నాటికి ఏపీకి ఉన్న అప్పుల వివరాలు తెలపాలని యనమల స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యాక మూడేళ్లల్లోనే మూడింతల మేర 3.25 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు అంటూ ఆయన మండిపడ్డారు.
కాంట్రాక్టర్లు, విద్యుత్ సంస్థల బకాయిల వివరాలు ఇవ్వాలని… ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల లెక్కలు అందించాలని కోరారు. ఏపీలో 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలుంటే.. 30 సంస్థలే ఆడిట్ లెక్కలు చూపాయని కాగ్ స్వయంగా చెప్పింది అని యనమల అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రాష్ట్ర అప్పుల వాస్తవ పరిస్థితి తెలియ చేయాలి.. ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు, విద్యుత్ సంస్థలకున్న బకాయిల వివరాలివ్వాలి.. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధుల ఖర్చు లెక్కలు అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు.