బీజేపీ ఎంపీ వైవీ సుజనా చౌదరి చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రాజేశాయి. సుజనా చౌదరి చేసిన కామెంట్లతో వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. సుజనా చౌదరి తీరును వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్‌కే రోజా ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు కొందరు బీజేపీతో టచ్ లో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల రోజా తీవ్రంగా స్పందించారు.
సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు తన కంపెనీల పేరుతో రుణాలు తీసుకుని బ్యాంక్‌లను మోసం చేశాడని రోజా విమర్శించారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని భయపడే సుజనా బీజేపీలో చేరారని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ నామరూపాల్లేకుండా పోవడంతో కేసులకు భయపడి బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుని సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీలో చేరారని మండిపడ్డారు.
బీజేపీలో చేరినప్పుడు టీడీపీ భూస్థాపితం చేస్తాను.. ఆ పార్టీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తీసుకొస్తానని మాటిచ్చి చేరాడని అన్నారు. ఇప్పుడు సుజనా చౌదరి వంటి మోసగాడి మాటలు టీడీపీలో ఎవ్వరు వినడం లేదు.. బీజేపీలోకి సుజనా చౌదరి వెంట ఎవ్వరు వెళ్లకపోవడంతో ఇలా వ్యవహరిస్తున్నాడని రోజా అన్నారు. సుజనా చౌదరి ఎప్పుడేమీ మాట్లాడుతారో ఆయనకే అర్థం కావడంలేదని మండిపడ్డారు. ఆయనలాగా తమ పార్టీ నేతలు బరితెగించరని, తమ పార్టీ నేతలు బీజేపీలో చేరాల్సిన అవసరం ఏముందో సుజనా చెప్పాలని నిలదీశారు.
తనలాగే అందరూ తప్పులు చేసి బీజేపీలో చేరతారని సుజనా చౌదరి భావిస్తున్నట్టుందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచరాజకీయాలు చేసే చంద్రబాబు వంటి నాయకుడ్నే ఎదుర్కొన్న వైసీపీ నేతలు ఈరోజు సుజనా చౌదరితో కలిసి మరో పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. సుజనా చౌదరి అన్నట్లుగా ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీలో చేరేందుకు సిద్దంగా లేరని రోజా స్పష్టం చేశారు. సుజనా చౌదరి చంద్రబాబు ఏజెంటుగా మారాడని విమర్శించారు. ఇకనైనా సుజనా చౌదరి తన పద్దతి మార్చుకోవాలని హితువు పలికారు.