వైసీపీ నేతలు తోక జాడిస్తే ఇక అంతేనా !

-

రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చి ఏడాదిన్నర దాటింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వంటి ప్రయోగాలతో ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల వరకు వెళ్లేలా ఒక చైన్‌ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. అయితే ఇదే సమయంలో కొందరు వైసీపీ నేతలు చేస్తున్న పనులు, వ్యవహరిస్తున్న తీరు పార్టీకి మచ్చ తెచ్చేలా ఉంటున్నాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డెర కార్పొషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన దేవళ్ల రేవతి సంఘటననే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు నాయకులు.


టోల్‌గేట్‌ దగ్గర ఫీజు కడితే సరిపోయే దానికి.. అధికార దర్పం ప్రదర్శించి.. అక్కడి సిబ్బందిపై రేవతి దాడి చేయడం కలకలం రేపింది. అంతేకాదు.. వైసీపీలో హాట్‌ హాట్ చర్చకు కారణమైంది. ఖాజా టోల్‌గేట్‌ దగ్గర జరిగిన సంఘటనలో తప్పెవరిది అన్నది మీడియాలో వచ్చిన దృశ్యాలే చెబుతున్నాయని.. పార్టీ పరువును బజారు కీడ్చేలా రేవతి ప్రవర్తన ఉందని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారట. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అధికారపార్టీలో వాడీవేడీ చర్చ ఆగలేదని చెబుతున్నారు.

ఇక జరిగింది చాలు.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాతైనా పార్టీ నేతల తీరు మారకపోతే ఎలా? ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? పదవులు ఇచ్చేది పార్టీ పరును రోడ్డు కీడ్చడానికా? అని పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకే కారణాలేవైనా.. ఇక పై వైసీపీ నేతలు ఎవరైనా గీత దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారట. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాలు తీసుకుంటుంటే.. దానికి భిన్నంగా నేతల తీరు ఉంటే అసలు లక్ష్యం నీరుగారిపోతుందని అభిప్రాయపడుతున్నారట.

ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా అందరికీ సంకేతాలు పంపారట. వైసీపీకి ఇబ్బంది కలిగించేలా నాయకుల తీరు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారట. ఇకపై ఈ రూల్‌ అందరికీ వర్తిస్తుందని.. బాధ్యతతో.. స్పృహతో మెలగాలని స్పష్టం చేశారట. తప్పు చేసిన వారిని వదిలేస్తే అసలకే ముప్పొచ్చే ప్రమాదం ఉందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. కొరడా ఝుళిపించేందుకు రెడీ అవుతున్నారు.

రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడం.. విమర్శలు చేయడం వేరు. కానీ.. చేతిలో అధికారం ఉందని.. అధికార పార్టీ నేతలమనే దర్పంతో రోడ్డున పడి కనిపించిన వారిపై దాడులు చేస్తే ఎలా ఊరుకుంటామని ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఖాజా టోల్‌గేట్‌ సంఘటన వైసీపీలో పెద్ద మార్పే తీసుకొచ్చిందని అనుకుంటున్నారు. మరి.. పార్టీ మూడ్‌కు అనుగుణంగా ఎంత మంది కుదురుగా ఉంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version