ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరి ఏ విధంగా ఉందీ అనేది ఇప్పుడు స్పష్టత రావడం లేదు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో జగన్ నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు వినపడుతున్నాయి. రాజధానిగా విశాఖ వద్దని, ఆ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే మాకు దూరమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ కు చెప్పలేక వాళ్ళు నలిగిపోతారని అంటున్నారు.
నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఈ అంశంపై తన అభిప్రాయం చెప్పారు. అలాగే మరికొంత మంది నేతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తాజాగా రాజధాని అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన ఆయన… కర్నూలును రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
‘కర్నూలు రాజధాని మన హక్కు’ అంటూ ఆయన అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసారు. కర్నూలును రాజధాని చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందుకోసం అవసరమైతే నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. వాస్తవానికి కర్నులుని న్యాయ రాజధానిని చెయ్యాలని అధికార పార్టీ భావించింది. అయితే ఆయన పూర్తి స్థాయి రాజధానిని కర్నూలులో డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.