బల్డియా ఎన్నికలకు వైసీపీ సై అంటుందా ?

-

గ్రేటర్ ఎన్నికల విషయంలో వైసీపీ కూడా ఓ నిర్ణయం తీసుకుందా ? సార్వత్రిక ఎన్నికల్లోనే సైలెంట్ అయిన పార్టీ… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటుందా…ఈ అంశం పైనే ఇప్పుడు రాజకీయపక్షాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో బలమైన సామాజికవర్గం పై పట్టున్న వైసీపీ త్వరలో జరుగనున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకోబోతుందో అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన కొద్ది రోజులకే వైసీపీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేసి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తొలి అధ్యక్షుడిగా నియమించారు జగన్. తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసేందుకు కొంతమేర కష్టపడిన పొంగులేటి… ఆ తర్వాత పార్టీ అధిష్టానం నుంచి ఆశించిన ప్రోత్సాహం లభించక కార్యక్రమాలు తగ్గించారు. అదే సమయంలో ఏపీలో వైసీపీ బలోపేతం పై జగన్ దృష్టి సారించారు. దీంతో తెలంగాణలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి వరకు తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా కొనసాగిన పొంగులేటి వైసీపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో జీహెచ్ఎంసికి జరిగిన రెండో ఎన్నికల్లో వైసీపీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా గత జిహెచ్ఎంసి ఎన్నికలకు వైసీపీ పోటీ చేయకపోవడం పై నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే పంథాను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అనుసరించింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటీవల గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు, సలహాలతో పాటు నిబంధనల ఎస్ఈసితో చర్చించినట్లు వైసీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడానికి సిద్ధమైందా అనే సందేహాలు మిగిలిన రాజకీయ పార్టీల్లో నెలకొన్నాయి.

బల్దియా ఎన్నికల విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని పార్టీ శ్రేణులు ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వైఎస్. రాజశేఖరరెడ్డి పై ఉన్న అభిమానంతో వైసీపీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్టీనే నమ్ముకుని పని చూస్తున్నామని, ఒక్క ఎన్నికల్లో అయినా తమకు పార్టీ టిక్కెట్ ఇవ్వాలని మొర పెట్టుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో టి వైసీపీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయి గ్రేటర్ ఎన్నికల అంశాన్ని చేర్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత వరకు లాభం చేకూరుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు టివైసీపీ నాయకులు. హైదరాబాద్ శివారు డివిజన్లల్లో ఏపీకి చెందిన వేలాది మంది ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారందరికి హైదరాబాద్ లో ఓటు హక్కు కూడా ఉండటం… వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలు కావడంతో పోటీ చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు. అసలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఎంతో మంది వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో ప్రచారం చేసుకుని లబ్ది పొందుతుంటే… వైసీపీ పార్టీకి చెందిన తామెందుకు ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిలదీస్తున్నారు.

వైసీపీ జాతీయ పార్టీగా ప్రకటించిన అధిష్టానం.. ఒకటి కంటే ఎక్కువ రాష్టాల్లో చెప్పుకోతగ్గ ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో తగినన్ని ఓట్లు పొంది ఉండాలని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈసీ నిబంధనల మేరకు జాతీయ పార్టీ హోదా పొందేందుకైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయాలని నాయకులు, కార్యకర్తలు పట్టుబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో తారాస్థాయిలో శత్రుత్వం లేకపోయినా… జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సిఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అవగాహన మేరకు గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ పోటీకి జగన్మోహన్ రెడ్డి సై అంటారా నై అంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version