ఆ జిల్లాలో టీడీపీకి ఊపిరి పోసిన వైసీపీ రెబల్స్

-

పంచాయతీ పోరులో ఆశించిన మేర ఫలితాలు రాక డీలపడ్డ టీడీపీకి ఆ జిల్లాలో మాత్రం అనూహ్య ఫలితాలు వచ్చాయి. అనుకోని విజయానికి కారణమైన అధికారపార్టీ రెబల్స్ ని తలుచుకుని తెగ సంబర పడుతున్నాయి టిడీపీ శ్రేణులు . రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఉన్నా గౌరవప్రదమైన స్ఠానాలు దక్కడంతో ఇదంతా నిజమా.. కలా అని అశ్చర్యానికి గురవుతున్నారట సిక్కోలు తెలుగు తమ్ముళ్లు.


టీడీపీకి కంచుకోటలాంటి శ్రీకాకుళం జిల్లాను అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లగొట్టింది వైసీపీ. అప్పటి నుంచి సైకిల్‌ పార్టీ మళ్లీ పుంజుకోకుండా అధికారపార్టీ అనేక రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. కేసులు.. నేతల నిర్భందాలు కాక పుట్టించాయి. ఇదే సమయంలో వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినా 199 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలిచి తెలుగు తమ్ముళ్లనే ఆశ్చర్యపరిచారు. దీని పై సిక్కోలు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పంచాయతీ పోరు నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత టీడీపీ మద్దతుదారులు బరిలో దిగేందుకు పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి సిక్కొలు జిల్లాలో ఉంది. కొన్నిచోట్ల పరువు కోసం.. మరికొన్నిచోట్ల పార్టీ నేతల ఒత్తిళ్లతో కొందరు పోటీ చేయక తప్పలేదు. అయితే ఇదే సమయంలో వైసీపీకి కూడా వింత అనుభవం ఎదురైంది. టీడీపీ మద్దతుదారులు బరిలో లేరన్న సంతోషం ఎంతో సేపు లేదు. వైసీపీ నుంచే భారీగా రెబల్స్‌ పోటీ చేయడంతో అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. జిల్లాలో 1166 పంచాయతీలు ఉంటే.. సగం చోట్ల వైసీపీ రెబల్స్‌ డేంజర్‌ బెల్స్‌ మోగించారు. ఇలా వైసీపీ రెబల్స్‌ బరిలో దిగిన పంచాయతీలలో టీడీపీ జెండాలు ఎగిరాయి.

తొలివిడతలోనే టీడీపీ మద్దతుదారులు 57 పంచాయతీలను కైవశం చేసుకున్నారు. రెండో విడతలోనూ 35 చోట్ల తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. వైసీపీ రెబల్స్‌ గెలిచిన చోట.. అధికార పార్టీ నాయకులు వారిని తమ శిబిరంలో కలిపేసుకున్నారు. మూడో విడతలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. చివరిదైన నాలుగో దశలో మాత్రం టీడీపీ పుంజుకోవడానికి వందశాతం వైసీపీ రెబల్స్‌ కారణమయ్యారన్న ప్రచారం జోరందుకుంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీకి ఊహించని విజయాలు దక్కాయి.

రెబల్స్‌ బెడదతో వైసీపీకి ఏకగ్రీవాలు సాధ్యం కాలేదు. పైగా అధికారపార్టీ మద్దతుదారుల విజయావకాశాలను గండికొట్టారు. ఇదే సమయంలో టీడీపీ మద్దతుదారుల విజయానికి వైసీపీ రెబల్స్‌ కలిసొచ్చారని అనుకుంటున్నారు. మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ముందు వైసీపీ రెబల్స్‌ మంచి కిక్‌ ఇచ్చారని సంబర పడుతున్నారట సిక్కోలు తెలుగు తమ్ముళ్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version