ఆ మున్సిపాల్టీలో వైసీపీ, టీడీపీ కలయిక పై ఆసక్తికర చర్చ

-

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు ఒకఎత్తు అయితే సిక్కొలు లో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు. ముఖ్యంగా పలాసలో ఎన్నికలకు ముందే వైసీపీకి జైకొట్టిన టీడీపీ కౌన్సిల్ అభ్యర్దులు ఇలా ఇక్కడ జరిగిన నాటకీయ పరిణామాలు రాష్ట్రం దృష్టినే ఆకర్షించాయి. ఎన్నికల్లో ఉప్పు నిప్పుగా పోరాడి కత్తులు దూసుకున్న రెండు పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త రాగం అందుకున్నాయి.

పలాస మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు ఎన్నికలకు ముందు ఢి అంటే ఢీ అన్నాయి. నామినేషన్ల ఉససంహరణ ముందు అధికారపార్టీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌..టీడీపీ క్యాంపు రాజకీయాలు రక్తి కట్టించాయి. నలుగురు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు రాత్రికి రాత్రి మంత్రి సీదిరి అప్పలరాజు శిబిరంలో చేరిపోయి వైసీపీకి జై కొట్టడంతో మిగిలిన అభ్యర్థులను క్యాంప్ కి తరలించింది టీడీపీ. ఇలా ఎన్ని ఎత్తులు వేసినా పలాసలో టీడీపీ 8 వార్డులు మాత్రమే గెలుచుకుంది. ఈ సీన్లు చూసిన వారంతా కౌన్సిల్‌ సమావేశాలో వైసీపీ, టీడీపీ మధ్య ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని లెక్కలేశారు.

ఇటీవల జరిగిన పలాస మున్సిపాలిటీ తొలి కౌన్సిల్‌ సమావేశానికి సభ్యులంతా హాజరయ్యారు. ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ దగ్గర నుంచి కౌన్సిలర్లు అంతా ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడమే సరిపోయింది. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఒకరినొకరు తెగ కీర్తించుకున్నారు. ఇక మంత్రి అప్పలరాజు ప్రస్తావించిన మ్యానిఫెస్టోలో అంశాలు సైతం పక్కన పడేసి పొగడ్తల వర్షంలో తడిసిముద్దయ్యారు రెండు పార్టీల నేతలు.

మున్సిపాలిటీ సమావేశాలు అంటే రణరంగమే అని లెక్కలేసిన స్థానికులు ఏం జరిగిందా అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికైన బల్ల గిరిబాబు గతంలో మున్సిపల్ చైర్మన్ గా చేసిన ప్రస్థుత టీడీపీ కౌన్సిలర్ వజ్జ బాబూరావు శిశ్యుడు కావడంతో కౌన్సిల్ సీన్ మొత్తం మారిపోయింది. దీంతో సమావేశంలో రాజకీయ గొడవలు పక్కనపెట్టి మనం మనం బరంపురం అని కొత్త చర్చకు ఆస్కారం ఇచ్చారు. బాబూరావు మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే గిరిబాబును కోఆప్షన్‌ మెంబర్‌గా ఎన్నుకున్నారు. అలాంటి గురుశిష్యులు ఇప్పుడు ఒక అండర్‌ స్టాండింగ్‌కు వచ్చేశారట.

కౌన్సిల్‌లో సన్నివేశాలను చూసిన స్థానికులు..ఎన్నికల నాటి ఆవేశాలు గుర్తు చేసుకుని ఆశ్చర్యపోతున్నారట. వైసీపీ,టీడీపీ నేతల అండర్ స్టాండింగ్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version