ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ 

-

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తొలిసారి సీఎం అయిన జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాలపై ప్రతిపక్ష టీడీపీ నుంచే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా విమర్శలు చేస్తోంది. టీడీపీ సంగతి పక్కన ఉంచితే, బీజేపీ ఓ వైపు సఖ్యతగా ఉంటూనే , మరోవైపు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.


జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్, విద్యుత్ పీపీఏల పునః సమీక్షంచడం నిర్ణయాల్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకించింది. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు వీటిపై తీవ్ర స్థాయిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. ఇలాంటి తరుణంలోనే అగ్నికి ఆజ్యం పోసేలా వైసీపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పట్ల బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

పోలవరం రివర్స్ టెండర్లు, పీపీఏల సమీక్ష మాత్రమే కాదు తాము తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల అనుమతి ఉందన్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చివరికి అమరావతి మార్పు అంశంలోనూ కేంద్రానికి అంతా తెలిసే జరిగిందన్నట్లుగా విజయసాయి ప్రకటన చేశారు. ఇక విజయసాయి ప్రకటనపై బీజేపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర నేతలు వారాలు విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వై.సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఎంపీ సుజనా చౌదరి.. ఇలా చాలా మంది నేతలు వైసీపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మోడీ, షాలకు సన్నిహితంగా ఉండే సత్యకుమార్ అయితే విజయసాయిని శిశుపాలుడితో పోల్చారు. శిశుపాలుడిలా విజయసాయి వంద తప్పులు చేస్తున్నారని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధపడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే విజయసాయి ఓ స్ట్రాటజీ ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ నేతలు అర్ధం చేసుకున్నారు. బీజేపీ వైసీపీకి పరోక్షంగా ఇచ్చిన మద్ధతుని ఆసరాగా చేసుకుని ,తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మోడీ, షాలు వెనుక ఉన్నారనే ప్రయత్నం విజయసాయి చేశారు.

అయితే విజయసాయి ప్రకటన పట్ల బీజేపీ ఒక్కసారిగా రివర్స్ ఎటాక్ చేయడంతో వైసీపీకి ఏం చేయాలో తోచని పరిస్తితి నెలకొంది. బీజేపీ నేతలకి కౌంటర్ ఇవ్వడానికి కూడా వైసీపీ ధైర్యం చేయట్ల. ఒకవేళ వివరణ ఇస్తే విజయసాయినే ఇవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి విజయసాయి ప్రకటనపై వైసీపీ నేతల పరిస్తితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. మొత్తం మీద విజయసాయి వైసీపీకి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టారు. మరి ఈ చిక్కులని ఎలా సరిచేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version