తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా యెస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3వ తేదీ వరకు యెస్ బ్యాంకుపై ఆర్‌బీఐ మారటోరియం విధించింది. దీంతో ఆ బ్యాంక్ కస్టమర్లు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే యెస్ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారితోపాటు ఆ బ్యాంకు ద్వారా ఈఎంఐ చెల్లింపులు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, మ్యుచువల్ ఫండ్స్ చెల్లింపులు చేస్తున్నవారికి అనేక సందేహాలు వస్తున్నాయి. మరి ఆ సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందామా..!
1. యెస్ బ్యాంకుతోపాటు ఆ బ్యాంకు కస్టమర్లపై విధించబడిన ఆంక్షలు ఏమిటి..?
* యెస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నవారు తమ సేవింగ్స్, కరెంట్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రూ.50వేలకు మించి విత్‌డ్రా చేయలేరు. ఒకటికన్నా ఎక్కువ అకౌంట్లు ఉన్నా సరే అన్ని అకౌంట్లలోనూ కలిపి నెలకు గరిష్టంగా రూ.50వేలకు మించి విత్‌డ్రా చేయలేరు.
* బ్యాంకు కొత్త లోన్లు ఇవ్వకూడదు. పేమెంట్లు చేయకూడదు.
* ఖాతాదారులు అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం లేదా ఉన్నత చదువులకు, పెళ్లికి రూ.5 లక్షల వరకు డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. అయితే అందుకు తగిన సాక్ష్యాధారాలు చూపించాలి. అప్పుడే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారు.
2. లోన్ల ఈఎంఐలు, ఎస్ఐపీలు, ఇన్సూరెన్సు చెల్లింపులు ఎలా..?
* యెస్ బ్యాంకు ఖాతాదారులు తాను ప్రతి నెలా చెల్లించే ఈఎంఐలు, ఎస్ఐపీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంల విలువ మొత్తం రూ.50వేలకు మించితే ఆ చెల్లింపులు ఆగిపోతాయి. అదే ఆ చెల్లింపుల మొత్తం రూ.50వేల లోపు ఉంటే ఆ పేమెంట్లు యథావిధిగా కొనసాగుతాయి. వాటికి ఇబ్బంది ఉండదు.
3. యెస్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉంటే..?
* యెస్ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లు వెంటనే తమ అకౌంట్‌ను వేరే ఏదైనా బ్యాంకుకు మార్పించుకోవాలి. లేదంటే శాలరీ విత్‌డ్రాకు ఇబ్బందులు తలెత్తుతాయి. శాలరీ అకౌంట్ మార్పు కోసం ఖాతాదారులు తాము పనిచేస్తున్న సంస్థ లేదా కంపెనీ అధికారులతో మాట్లాడాలి. వీలైనంత త్వరగా యెస్ బ్యాంకు నుంచి వేరే ఏదైనా బ్యాంకుకు శాలరీ అకౌంట్‌ను మార్చుకోవాలి. అయితే జీతం రూ.50వేల కన్నా తక్కువ వచ్చే వారు అకౌంట్‌ను మార్చాల్సిన పనిలేదు.
4. యెస్ బ్యాంక్ అకౌంట్.. మ్యుచువల్ ఫండ్స్‌కు లింక్ అయి ఉంటే..?
* యెస్ బ్యాంక్ అకౌంట్.. మ్యుచువల్ ఫండ్స్‌కు లింక్ అయి ఉన్నవారు దాన్ని ఇతర బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసుకోవాలి. అందుకు గాను కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీస్ (సీఏఎంఎస్) కార్యాలయంలో క్యాన్సిల్డ్ చెక్ ఇచ్చి ఇతర బ్యాంక్ అకౌంట్లను మ్యుచువల్ ఫండ్స్‌కు లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మ్యుచువల్ ఫండ్స్ కంపెనీలు ఇన్వెస్టర్ల డబ్బును సురక్షితంగా ఉంచడం కోసం నిధులను యెస్ బ్యాంక్ అకౌంట్లలోకి విత్‌డ్రా చేసేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు. కనుక ఖాతాదారులు యెస్ బ్యాంక్ అకౌంట్ల స్థానంలో ఇతర బ్యాంక్ అకౌంట్లను మ్యుచువల్ ఫండ్స్‌కు లింక్ చేసుకుంటే మంచిది.
5. యెస్ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన చెందాలా..?
* యెస్ బ్యాంక్ కస్టమర్ల డబ్బుకు ఎలాంటి ఢోకా లేదని, వారి డబ్బు సురక్షితంగానే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇది వరకే చెప్పారు. అయితే రానున్న రోజుల్లో బ్యాంకును కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ఏదైనా కొత్త స్కీంను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిసింది.
* కానీ తప్పనిసరి పరిస్థితిలో యెస్ బ్యాంకును మూసివేయాల్సి వస్తే ఖాతాదారులకు గరిష్టంగా రూ.5లక్షల వరకు మాత్రమే డబ్బును రివకరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా డిపాజిట్ ఇన్సూరెన్స్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇక రూ.5 లక్షలు అంతకన్నా తక్కువ మొత్తం యెస్ బ్యాంకులో ఉన్నవారు ఆందోళన చెందాల్సి పనిలేదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ ద్వారా ఆ మొత్తం వస్తుంది. కానీ రూ.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తం ఆ బ్యాంకులో ఉన్నవారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఆర్‌బీఐ పరిస్థితిని అక్కడి వరకు తీసుకువస్తుందా, యెస్ బ్యాంకు భవిష్యత్తు ఏమవుతుంది..? అన్న వివరాలు తెలియాలంటే.. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆగక తప్పదు..!