తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ బ్యాంక్ వ్యవస్థాపక చైర్మన్ రానా కపూర్ పై మనీ లాండరింగ్ కింద ఇప్పటికే కేసులు నమోదు కాగా, ప్రస్తుతం తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా యెస్ బ్యాంక్ మోసాలు బయటకు వస్తున్నాయి. ఆ బ్యాంక్ ఎలాంటి తనఖాలు లేకుండానే కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా రుణాలు ఇచ్చిందని తేలింది. దాదాపుగా 10 బడా కార్పొరేట్ సంస్థలకు చెందిన 44 కంపెనీలకు యెస్ బ్యాంకు రూ.34వేల కోట్ల వరకు రుణాలను ఇచ్చిందని వెల్లడైంది.
యెస్ బ్యాంకు నుంచి రుణాలు పొందిన కంపెనీల్లో పలు ప్రముఖులకు చెందిన కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా అనిల్ అంబానీకి చెందిన 9 కంపెనీలకు రూ.12,800 కోట్లు, సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన 16 కంపెనీలకు రూ.8,400 కోట్లు, దేవన్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన బిలీఫ్ రియల్టర్స్ గ్రూప్‌కు రూ.4,735 కోట్ల రుణాలను యెస్ బ్యాంక్ ఇచ్చినట్లు తేలింది. అలాగే జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.1100 కోట్ల అప్పు ఇచ్చినట్లు కూడా వెల్లడైంది.
ఇక కెర్కర్ గ్రూప్‌కు చెందిన కాక్స్ అండ్ కింగ్స్, గో ట్రావెల్స్ అనే రెండు సంస్థలు రూ.1000 కోట్ల రుణాలను తీసుకోగా, బీఎం ఖైతాన్ గ్రూప్‌కు చెందిన మెక్ లియాడ్ రసెల్ కంపెనీ రూ.373 కోట్లను, ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ రూ.2,710 కోట్లను, రేడియస్ డెవలపర్స్ రూ.1200 కోట్లను, థాపర్ గ్రూప్‌కు చెందిన సీజీ పవర్ రూ.500 కోట్లను రుణాలుగా పొందాయి. అలాగే యెస్ బ్యాంక్ చైర్మన్ రానా కపూర్ తన సొంత లాభం కోసం పలు కంపెనీలకు మేలు చేసే విధంగా వ్యవహరించారని కూడా తెలిసింది. అయితే ఆ లోన్లు తీసుకున్న కంపెనీలు వాటిని అప్పనంగానే తీసుకున్నాయి కనుక వాటిని అవి తిరిగి చెల్లించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. బ్యాంకులు సాధారణ, పేద, మధ్య తరగతి వారిని ఎలా మోసం చేస్తాయో యెస్ బ్యాంకు కుంభ కోణంతో మరోసారి బయట పడింది..!