నిజాం వారసులు.. కారు పార్టీ ని కడిగేసిన యోగి

-

గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు బిజెపి ఏ విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి వ్యవహారాలను హైలెట్ చేసుకుంటూ, ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు అంతా ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గ్రేటర్ లో వేలకోట్ల సొమ్ముతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించే విధంగా బిజెపి నాయకులు ప్రసంగాలతో గ్రేటర్ లో హీటు పెంచుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు గ్రేటర్ లో సందడి చేశారు.
బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూకట్ పల్లి లో రోడ్ షో  నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలపై యోగి విమర్శలు చేశారు. అసలు హైదరాబాద్ అభివృద్ధి చెందకుండా, ఈ రెండు పార్టీల నేతలు అడ్డుకుంటున్నారని, యోగి మండిపడ్డారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున కబ్జా చేశారని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని, ఈ నిజాం వారసులకు తగిన బుద్ధి చెప్పాలని యోగి ప్రజలను కోరారు  హైదరాబాద్ ను ఓ కుటుంబం దోచుకోవాలని చూస్తోందని,  వారికి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు.
ఉత్తరప్రదేశ్ లో తమ ప్రభుత్వం 30 లక్షల ఇళ్లు కట్టించింది అని, టిఆర్ఎస్ ప్రభుత్వం తమ ఆరేళ్ల పరిపాలన కాలంలో ఎంత మంది పేదలకు ఇళ్లు కట్టించిందో చెప్పాలంటూ యోగి ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని , కానీ ఇప్పటి వరకు ఆ హామీలను నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని యోగి విమర్శించారు .గ్రేటర్ లో అభివృద్ధి బీజేపీతో సాధ్యమవుతుందని,  అందుకే తమ పార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ప్రజలను ఈ సందర్భంగా యోగి కోరారు. యోగి ప్రసంగాలతో బిజెపి నాయకుల్లో మంచి ఉత్సాహం కనిపించింది. ఇక రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ్రేటర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. వరుసగా జాతీయ స్థాయి నాయకులు బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడంతో టిఆర్ఎస్ శిబిరంలో కాస్త ఆందోళన పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కెసిఆర్ బీజేపీపై సంచలన విమర్శలు చేశారు.
-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version