మార్కెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కృత్రిమ ఎరువులతో పండించిన కూరగాయలే లభిస్తున్నాయి. సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు అందుబాటులో ఉన్నా ధరలు ఎక్కువగా ఉంటుండడం వల్ల ఎవరూ కొనుగోలు చేయడం లేదు. అయితే కొన్ని రకాల కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో ఇంట్లోనే తక్కువ స్థలంలోనూ పెంచుకోవచ్చు. మరి ఆ కూరగాయలు ఏమిటంటే..
1. కీరదోస
వేసవిలో కీరదోసను ఎక్కువగా తీసుకుంటారు. వీటిని ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు. మట్టిలో తేమ, సేంద్రీయ ఎరువులు ఉంటే చాలు, కీరదోస సులభంగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా కీరదోసను పొందవచ్చు.
2. చిలగడ దుంపలు
వేడిగా ఉండే వాతావరణంలో చిలగడదుంపలు బాగా పెరుగుతాయి. వీటి సంరక్షణకు పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన పనిలేదు. చాలా తక్కువ శ్రమతోనే ఈ వీటిని పెంచవచ్చు.
3. బీన్స్
తక్కువ శ్రమతో ఇంట్లోనే తక్కువ స్థలంలో వీటిని పెంచవచ్చు. సేంద్రీయ ఎరువులు వేస్తే ఎక్కువ బీన్స్ వస్తాయి.
4. మిరపకాయలు
వీటిని కూడా ఇంట్లో తక్కువ స్థలంలో పెంచవచ్చు. 2, 3 మొక్కలు వేసినా చాలు, సేంద్రీయ ఎరువుతో ఎక్కువ కాయలు కాస్తాయి.
5. వంకాయలు
వంకాయలు వేడి వాతావరణంలో పెరుగుతాయి. వీటికి కూడా పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. తక్కువ స్థలం అవసరం అవుతుంది. త్వరగా కాయలు చేతికి వస్తాయి.
6. బెండకాయలు
పొడి, వేడి వాతావరణంలో బెండ కాయలు బాగా వస్తాయి. ఈ మొక్కలను సులభంగా తక్కువ స్థలంలోనే పెంచవచ్చు.
ఇవే కాకుండా టమాటాలు, సాధారణ దోస కాయలు, సొర కాయలు, బీర కాయలు, చిక్కుళ్లు వంటి కూరగాయలను కూడా తక్కువ స్థలంలోనే సులభంగా పెంచవచ్చు. సేంద్రీయ పద్ధతిలో పెంచితే ఆరోగ్యకరమైన కూరగాయలు లభిస్తాయి. ఎప్పటికప్పుడు తాజాగా వాటిని కోసి వండుకుని తినవచ్చు.