తెలంగాణలో ప్రజా విజయోత్సవాల ప్రచారం కోసం కళా యాత్ర పేరుతో ప్రచార వాహనాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీల అమలు విషయాలపై గ్రామ గ్రామాన కళాకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని కొంత మంది ప్రజలు అడ్డుకున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ప్రచారానికి వచ్చిన కళాకారులను గ్రామ ప్రజలు అడ్డుకుని వారిని పంపించి వేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో విజయోత్సవాల పేరిట చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినవి ఏమిటి, ఏడాది గడుస్తున్నా అమలు చేసింది ఏమిటి? అంటూ సామాన్యులు నిలదీస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్కి ఎదురవుతున్న పరిస్థితి చూస్తే అబ్రహం లింకన్ చెప్పిన మాటలు గుర్తువస్తున్నాయని వివరించారు. ‘మీరు కొన్నిసార్లు
కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ ప్రజలందరినీ ఎల్లవేళలా మోసం చేయలేరు’ అని లింకన్
రాసిన కొటేషన్ తో కౌంటర్ ఇచ్చారు హరీశ్ రావు.