ప్రారంభంలో బాగా ఉండి చివరికి వచ్చేసరికి మిమ్మల్ని మీకు కాకుండా చేసే విషయాల గురించి మీరు తెలుసుకోవాలి. మీ జీవితమ్లో మీరు సజావుగా సాగిపోతున్నారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిశ్శబ్దంగా ఉండే కొలనులో కూడా అప్పుడప్పుడు అలజడి తప్పదు. మన జీవితం కూడా అలాంటిదే. ఒక్కోసారి ఇబ్బందులు వస్తుంటాయి. మనం అలవాటుగా మార్చుకున్న కొన్ని విషయాలు మనల్ని విడిచి పెట్టకుండా మనతో పాటే పెరిగి, ఒక్కోసారి మనకంటే ఎత్తుకు ఎదిగి మనల్నే మింగేస్తాయి. అలాంటి అలవాట్లని చేసుకోకుండా ఉండడమే మంచిది. లేదా మొదట్లోనే వాటిని తుంచేస్తే బెటర్.
అలాంటి అలవాట్లేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
చేతిలో డబ్బు బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చాలా అలవాట్లు అవుతుంటాయి. వాటిలో సిగరెట్, ఆల్కహాల్, స్త్రీలోలత్వం కూడా ఉంటాయి. వీటికి బానిసగా మారితే జీవితం నాశనం అయిపోతుంది. మొదట్లో వీటి రుచి చాలా బాగుంటుంది. కానీ పోను పోనూ అవి మీ జీవితాన్నే కబళించేస్తున్నాయన్న సంగతి తెలియకుండా పోతుంది.
మీకు మీరే కావాలని మరొకరితో గొడవ పెట్టుకోవద్దు. యుద్ధం అటు నుండి మొదలైతే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అనవసరమైన యుద్ధాలు జీవిత గమ్యాలని మార్చేస్తాయని తెలుసుకో.
నీకు నువ్వుగా నీ కుటుంబం నుండి గానీ, నీ దగ్గర వాళ్ళ నుండి గానీ వేరు కావద్దు. కష్టకాలంలో నీకెవరూ లేకపోయినా నువ్వు బాధపడవద్దు. నీ నుండి వాళ్ళు వెళ్ళిపోతే తప్ప నువ్వు మాత్రం నీ వారిని వదిలిపెట్టవద్దు.
హాస్యం కోసమో, ప్రతీకారం కోసమో అవతలి వారి ఎమోషన్స్ తో ఆడుకోవద్దు.
గమ్యం తెలియకుండా ప్రయాణం మొదలుపెట్టవద్దు. నువ్వు చేసే పని నిన్ను ఎక్కడకి తీసుకువెళ్తుందో తెలియకుండా ఏ పనీ మొదలు పెట్టవద్దు.