డయాబెటిస్, హైబీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటి వరకు సైంటిస్టులు చెబుతూ వచ్చారు. అయితే వీరితోపాటు యుక్త వయస్సులో ఉండి స్థూలకాయంతో ఉన్నవారికి కూడా కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు జామా ఇంటర్నల్ మెడిసిన్ అనే ఓ జర్నల్‌లో సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించారు.
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన సైంటిస్టు బృందం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన 4 లక్షల మంది పేషెంట్ల తాలూకు వివరాలను సేకరించింది. అలాగే మరో 75 అధ్యయనాలకు చెందిన సమాచారాన్ని కూడా వారు పరిశీలించారు. చివరకు వారు గుర్తించింది ఏమిటంటే.. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 అంతకన్నా ఎక్కువ ఉన్నవారు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిర్దారించారు.
ఇక స్థూలకాయంతో ఉన్నవారికి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతోపాటు వారు ఎమర్జెన్సీ దశకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎందుకంటే స్థూలకాయం ఉన్నవారిలో శరీరం వాపులకు లోనవుతుంది. ఇది కరోనాకు ఊతం ఇస్తుంది. కరోనా వచ్చిన వారిలో సహజంగానే వాపులు వస్తాయి. అదే స్థూలకాయం ఉన్నవారిలో అప్పటికే వాపులు ఉంటాయి కనుక.. వారికి కరోనా వస్తే.. సమస్య మరింత జటిలం అవుతుంది. అలాగే వారు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల స్థూలకాయంతో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇక స్థూలకాయం ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినా పెద్దగా పనిచేయకపోవచ్చని, అందువల్ల వారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలని హెచ్చరిస్తున్నారు.