అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ పేరు వాడకండి.. నాయకులు, కార్యకర్తలకు బీజేపీ ఆదేశం..

-

అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌లు ప్రస్తుతం అక్కడ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఎక్కడా బీజేపీ పేరును అక్కడి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాడకూడదని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ ఫారిన్‌ అఫెయిర్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ విజయ్‌ చౌతాయివాలె ఆదేశాలు జారీ చేశారు.

అమెరికాలో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు వ్యక్తిగతంగా అక్కడి ఏ పార్టీకైనా మద్దతు తెలపవచ్చని, కానీ ఎక్కడా బీజేపీ పేరు వాడకూడదని విజయ్‌ అన్నారు. అమెరికాతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆ సంబంధాలు భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలంటే అక్కడ ఎన్నికలలో పార్టీ పేరును వాడకూడదని సూచించారు. ఇక బీజేపీ మద్దతుదారులు, నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే.. తమ సొంతంగా పార్టీ పేరు వాడకుండా అక్కడ ఏ పార్టీ క్యాంపెయిన్‌లలో అయినా పాల్గొనవచ్చని అన్నారు.

కాగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు మాత్రం గతంలో.. సెప్టెంబర్‌ 2019లో హూస్టన్‌లో నిర్వహించిన హౌడీ మోడీ, భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమాలకు చెందిన వీడియోలను తమ ఎన్నికల క్యాంపెయిన్‌ కోసం ఉపయోగిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో మోదీ, ట్రంప్‌ ఇద్దరూ పాల్గొన్నారు. అందువల్ల అమెరికాలో రిపబ్లికన్లు ఆయా కార్యక్రమాలకు చెందిన వీడియోలతో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version