భారీ ఖ‌ర్చుల‌తో పెళ్లిళ్లు.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న యువ‌కులు..!

-

మ‌న దేశంలో ప్ర‌స్తుతం న‌యా ట్రెండ్ న‌డుస్తోంది. అది ఎందులోనో కాదు, పెళ్లిళ్ల విష‌యంలో. యువ‌తీ యువ‌కులు భారీగా ఖ‌ర్చు పెట్టి, హంగూ ఆర్భాటాల‌కు పోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే సంప‌ద బాగా ఉంటే అది వేరే విష‌యం. కానీ ఆ విష‌యంలో అంతంత మాత్రంగానే ఉండేవారు కూడా అవ‌న‌స‌రంగా అప్పులు చేసి మ‌రీ బాగా ఖర్చు పెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. దీని కార‌ణంగా పెళ్లి త‌రువాత ఆ వ‌ధూవ‌రుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో ప‌డిపోతున్నాయి.

మ‌న దేశంలో ఇప్పుడు పెళ్లిళ్లు కూడా వ్యాపారంగా మారాయి. ఖ‌రీదైన దుస్తులు, భారీ వేదిక‌లు, ప‌దుల సంఖ్య‌లో వెరైటీలు క‌లిగిన డిన్న‌ర్‌.. ఇలా ప్ర‌తి అంశంలోనూ వ‌ధూవ‌రుల కుటుంబాలు భారీగానే ఖ‌ర్చు చేస్తున్నాయి. ఇక మ‌న దేశంలో వ‌ధువు వ‌రుడికి క‌ట్నం ఇవ్వడం అన్న దురాచారం ఉండ‌నే ఉంది క‌దా. దాంతో వ‌ధువు త‌ల్లిదండ్రుల‌పై మ‌రింత భారం ప‌డుతోంది. ఇక మ‌రోవైపు వ‌రుడి కుటుంబంలోనూ ఆర్థికంగా లేక‌పోయినా పెళ్లి విష‌యానికి వ‌చ్చే స‌రికి అప్పో సొప్పో చేసి మ‌రీ భారీగానే వేడుక‌ల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు.

ఇలా పెళ్లిళ్ల‌కు భారీగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టడం వ‌ల్ల ధ‌నిక కుటుంబాలపై ఆ ప్ర‌భావం ఏమీ ప‌డ‌డం లేదు. కానీ హంగూ, ఆర్భాటాల‌కు పోయే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి వివాహాలు చేస్తుండ‌డం వ‌ల్ల తదుప‌రి కాలంలో పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చ‌లేక తీవ్ర మ‌నోవేద‌న‌కు లోన‌వుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై ప‌లువురు సామాజిక వేత్త‌లు కూడా స్పందిస్తున్నారు. ఇలా పెళ్లిళ్ల కోసం భారీగా ఖ‌ర్చు చేయ‌కుండా, కొంత డ‌బ్బు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టేలా కొత్త‌గా ఏదైనా చ‌ట్టాన్ని తీసుకువ‌స్తే అటు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు అనువుగా ఉంటుందంటున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news