ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాజధాని సౌత్ ఆఫ్రికా మోడల్ గా ఉంటుందని… మూడు రాజధానులుగా అమరావతి, విశాఖ, కర్నూలు ఉంటాయని జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాజధాని విషయంలో జగన్ ఏ స్థాయిలో స్పష్టంగా ఉన్నారు అనేది అర్ధమైంది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా… మెజారిటి మాత్రం జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీనిపై విమర్శలు చేసారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా దెబ్బ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్ధికంగా తెలుగుదేశం నేతలు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం హయాంలో ఎక్కువగా భూములు కొనుగోలు చేసి పెట్టారు ఆ పార్టీ నేతలు. అమరావతిలో రాజధాని ప్రకటన వస్తుంది అని తెలియగానే ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిసర గ్రామాలతో పాటుగా విజయవాడ, గుంటూరు, ఒంగోలు వరకు కూడా భూములను తెలుగుదేశం నేతలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రాజధాని పేరుతో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరిగితే మాత్రం… అమరావతి ప్రాధాన్యత భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనితో ఆ పార్టీ నేతలు ఆర్ధికంగా ఇబ్బంది పడటం ఖాయమనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ వంటి వారికి భూములు ఉన్నాయ్, అలాగే ప్రత్తిపాటి పుల్లారావు సహా… కొంత మందికి ఇక్కడ భూములు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఇది ఆర్ధికంగా ఆ పార్టీని ఇబ్బంది పెట్టడం ఖాయమని అంటున్నారు.