తన హయాంలో చంద్రబాబు ఇష్టానుసారం డబ్బులు తగలేశారని.. ఇప్పుడు జగన్ కూడా అలాగే చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని… ఆయనకు పాలించడం చేత కాదని తాను ముందే చెప్పానని కన్నా అన్నారు. ఆరు నెలల కాలంలోనే అధికార యంత్రాంగంపై జగన్ పట్టు కోల్పోయారని చెప్పారు. జగన్ నియంతృత్వ ధోరణితో ముందుకు సాగుతున్నారని… ఆయన తీరును వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారని అన్నారు. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని జగన్ చెప్పడం సరికాదని చెప్పారు.
మీరు ఢిల్లీకి వెళ్లినప్పుడే అమిత్ షాను కలవాలనుకోవడం సరికాదని అన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సూచనలను సీఎం వినడం లేదని మండిపడ్డారు. మాకు ఇష్టం వచ్చిన రీతిలో పాలిస్తామని ధోరణితో జగన్ వెళ్తున్నారని కన్నా విమర్శించారు. జగన్ తీరుతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ప్రజలు ఆస్తులను చంద్రబాబు తాకట్టు పెడితే… జగన్ అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. మరియు ఇంగ్లీష్ మీడియంను కేవలం ఒక ఆప్షన్ గా మాత్రమే పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.