ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో అయితే.. ఓ పండగ వాతావరణం నెలకొంది. నవరత్నాలు-పేదలకు ఇళ్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్.. దీనిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది పేదలకు వచ్చే ఉగాది నాటికి పట్టాలు ఇచ్చి, ఇళ్లను చేతికి అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆదిలో అందరూ ఇదేమవుతుంది? అని పెదవులు విరిచారు. అయితే, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. అధికారులను సమాయత్తం చేయడంతోపాటు.. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా.. దానిని వెంటనే పరిష్కరిస్తున్నారు. భూ సేకరణ నుంచి ప్రతి విషయాన్నీ తన కనుసన్నల్లోనే జగన్ చేస్తుండడం మరింతగా ఆసక్తిని సంతరించుకుంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఈ పనిపైనే నిమగ్నమైంది. ఎక్కడ ఏ అధికారుల నోట విన్నా కూడా ఈ విషయమే ప్రస్థావనకు వస్తోంది. తహశీల్దారుల నుంచి కింది స్థాయి వీఆర్ వోల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ పనిపైనే ఉన్నారు. దీంతో ఉగాది నాటికి అందరికీ ఇళ్లు ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వ్యూహాత్మకంగా అత్యంత వేగంగా ముందుకు సాగుతుండడం గమనార్హం. గ్రామాల్లో అయితే సెంటున్నర, పట్టణాలు, నగరాల్లో ఉంటున్న పేదలైతే.. సెంటు భూమిని ప్రభుత్వం రూ.20 కే అందిస్తున్న ఈ పథకంలో ఇప్పుడు మరో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది.
ఈ పరిణామం అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం భూ సమీకరణ దాదాపు కొలక్కి వచ్చింది దాదాపు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో ఆయా స్థలాలను గుర్తించిన అధికారులు ఇప్పుడు లే అవుట్లు వేస్తున్నారు. అయితే, ఇది ఏదో ఆడుతూ పాడుతూ కాకుండా చాలా సీరియస్‌గా సాగుతుండడం గమనార్హం. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా.. పట్టణానికి వెళ్లినా.. ప్రభుత్వం స్థలాలు ఇవ్వాలని అనుకున్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఆర్చిలు కనిపిస్తున్నాయి. దానిపై నవరత్నాలు-పేదలకు ఇళ్లు పథకంలో కేటాయించిన స్థలాలు అని రాసి ఉండడంతోపాటు ఎటు చూసిన భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లను తలదన్నేలా వెంచర్లు వేశారు.
ఎవరికి ఏయే స్థలం ఇవ్వనున్నారో.. ముందుగానే ముగ్గులతో సెపరేట్ చేశారు. దీంతో ఎక్కడ చూసిన ఈ కోలాహలం, ఇదే విషయంపై మాట్లాడు కోవడం కనిపిస్తోంది. అయితే, ఎవరికి ఏ స్థలం దక్కుతుందనేది లాటరీ తీయనున్నారు. ఈ విషయంలోనూ ఎలాంటి వివాదాలకు, న్యాయపరమైన సమస్యలకు తావులేకుండా ప్రభుత్వం చూస్తుండడం గమనార్హం.