ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ ఎండకు ఆ గొడుగుపడుతున్నారని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ట్వీట్టర్ వేదికగా తెదేపా – కాంగ్రెస్ పొత్తుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. 1956 నవంబర్ 1వ తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు నాడే.. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టిన శక్తులతో చంద్రబాబు చేతులు కలిపి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మంటగలిపారని పేర్కొన్నారు. గెలుపుకోసం, ఆతర్వాత నాలుగేళ్లు భాజపాని వాడుకున్నారు.
ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో భాజపా రాష్ట్రానికి తీవ్రం ద్రోహం చేసినా కలిసి వారితో కాపురం చేశారు. రాష్ట్రాన్ని పద్ధతి లేకుండా విడగొట్టిన కాంగ్రెస్‌నూ సైతం వాడుకోవడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. దేశం కోసం అవసరమైనప్పుడు భాజపాతో జతకడతారేమో అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరిని అడిగిన చెబుతారని ఆయన వెల్లడించారు.