కూటమి ప్రభుత్వం ఉద్యోగాలపైనా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది అని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సందర్భంగా 2014–25 రెండవ సామాజిక ఆర్థి సర్వేలో కూడా ఏం చెప్పారంటే.. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2024–25కి సంబంధించి 27,07,752 ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారు. ఎంత దారుణ మోసం. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఏకంగా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పడం పచ్చి మోసం. ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు గత ఏడాది రూ.36 వేలు ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అంటే ప్రతి పిల్లాడికి ఇప్పటికే రూ.72 వేలు బకాయి. అంత మోసం. దగా. వంచన. ఇటు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతిలేదు. మరోవైపు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు.
2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తే, అక్టోబరు 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.36 లక్షల ఉద్యోగాలు, మరో 2.66 లక్షల వాలంటీర్లు, ఆప్కాస్ ద్వారా మరో 96 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీలో 58 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. 5 ఏళ్లలో మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ చూస్తే.. 6,31,310. లార్జ్ అండ్ మెగా సెక్టార్లో కల్సించిన ఉద్యోగాలు చూస్తే.. 1.02 లక్షల ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈ సెక్టార్లో 32,79,970 ఉద్యోగావకాశాలు కల్పించాం. అలా ఆ 5 ఏళ్లలో మేము ఇచ్చిన, కల్పించిన మొత్తం ఉద్యోగాలు చూస్తే.. 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం అని మాజీ సీఎం పేర్కొన్నారు.