విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మధురవాడకు చెందిన చంద్రవరంకు చెందిన కుటుంబంలోని నలుగురు మృతుల కుటుంబ సభ్యులను ఆయన సాంత్వనపరిచారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జగన్, ఈ విషాద ఘటనను దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. “చందనోత్సవానికి ముందు నుంచే తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉంది. కానీ ఆయన అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు,” అని జగన్ ఆరోపించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇటీవల నిర్మించిన గోడ వర్షానికి తట్టుకోలేక కూలిపోవడాన్ని ఉదహరించి, ఆ పనులపై ప్రభుత్వం ఏ నియంత్రణా లేకుండా వ్యవహరించిందన్నారు.
“తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన, ఇప్పుడు సింహాచలం విషాదం… ఇవన్నీ భక్తుల ప్రాణాలు తీసేలా మారుతున్నాయి. ప్రభుత్వం కమిటీలు వేస్తుంది కానీ చర్యలు ఉండవు, ఎందుకంటే దోషి చంద్రబాబే,” అని జగన్ విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యమే స్పష్టమని, బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందుబాటులో లేకపోతే తమ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారు.