దొరగారికి ఎన్నికల ముందు హామీలు గుర్తుకు వస్తాయి : షర్మిల

-

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు అందరూ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, కానీ తెలంగాణలో మాత్రం దొరగారికి ఎన్నికల ముందు హామీలు గుర్తుకు వస్తాయని వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. నాలుగేళ్ల పాటు కుంభకర్ణుడిలా మొద్దు నిద్రపోయిన సీఎం ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టోను తిరగేస్తున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ రైతులను ఓట్లు అడిగే ముఖం లేక రుణమాఫీ అంటూ నక్క వినయం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీకి కేసీఆర్ వద్ద చిల్లిగవ్వ లేదన్నారు వైఎస్ షర్మిల. బీఆర్ఎస్ బంధిపోట్లకు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందని, ఇక మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయని ప్రశ్నించారు.

రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్‌లో రావాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందుకు తీసుకు వచ్చాడన్నారు. జనాలకు మద్యం తాగించి… ఆ వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట అని నిప్పులు చెరిగారు. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? ధరలు పెంచి, పన్నులు పెంచి ప్రజల రక్తం తాగడం చాలదని, మద్యం తాగించి, మహిళల మంగళసూత్రాలు తెంపి, జనాలను మద్యానికి బానిస చేసి ఓట్లు దండుకోవడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన దొర, ఇప్పుడు రుణమాఫీ చేయడానికి కరోనా అడ్డు తగిలిందట అని నిప్పులు
చెరిగారు. ఇవి చాలదన్నట్లు ఔటర్ రింగ్ రోడ్డును అతి తక్కువ ధరకు రూ.7 వేల కోట్లకే లీజుకు ఇచ్చారన్నారు. ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నారని, ఎన్నికల కోసం ప్రణాళికతో డబ్బును పోగు చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తాడనే మాటను నిలబెట్టుకున్నాడన్నారు. ఈ పిట్టల దొర ముచ్చట సొంత పార్టీ ఎమ్మెల్యేలూ నమ్మరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version